
నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
కరీంనగర్‌టౌన్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు బుధవారం నుంచి పూర్తిస్థాయిలో నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం కారణంగానే సేవలు నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖనరెడ్డి పుణ్యమాని 17 సంవత్సరాలుగా నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందగా, ఈ ఏడాదిలోనే జనవరిలో ఒకసారి సేవలు నిలిపివేశారు. అయినప్పటికీ బిల్లుల పంచాయితీ తేలకపోవడంతో మరోమారు సేవల నిలిపివేతకు నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. రోడ్డు ప్రమాదాలు, గుండె సమస్యలు, అపెండైసిస్ లాంటి అత్యవసర సేవలకు తీవ్ర అవస్థలుపడే పరిస్థితి ఏర్పడనుంది. గతంలో ఈ పథకం కింద ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా ఓపీ, రక్తపరీక్షలు, ఆపరేషన్లు నిర్వహించే వారు. ఇందుకోసం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును నేరుగా ఆసుపత్రుల ఖాతాల్లోకే జమ అయ్యేవి. కొంత కాలంగా బకాయిలు పెరిగిపోవడంతో నిర్వహణ భారమైన ఆసుపత్రులు ఈ నిర్ణయం తీసుకోవడంతో వైద్యం నిరుపేదలకు అందని ద్రాక్షగా మారింది. ఉమ్మడి జిల్లాలో 49 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులు ఉండగా, అందులో 32 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ, ప్రైవేటు బోధనాసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులైన అపోలోరీచ్, మెడికవర్ మినహా అన్ని ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయనున్నాయి. దీంతో రోగులు ప్రైవేటు బోధనాసుపత్రులకు పరుగులు తీసే అవకాశం ఉంది. ఆసుపత్రులన్నీ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో ప్రైవేటు బోధనాసుపత్రులకు, కార్పొరేట్ ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరగనుంది. ఉమ్మడి జిల్లాలో ప్రతీ రోజు సుమారు 70 మందికి పైగా ఆరోగ్యశ్రీ పథకం కింద ఆసుపత్రులలో చికిత్స పొందేవారు. సేవలు నిలిపివేస్తుండడంతో ప్రభుత్వ తీరు, ఆసుపత్రుల వ్యవహారశైలిపై రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.