
సాంకేతిక విద్య కీలకం
జగిత్యాల/వెల్గటూర్: టీచింగ్, లర్నింగ్ మెటిరియల్ ద్వారా పాఠాలు సులభతరంగా అర్థమవుతాయని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని పొన్నాల గార్డెన్స్‌లో టీచింగ్, లర్నింగ్ మెటిరియల్ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రోజురోజుకు సాంకేతికత వేగంగా విస్తరిస్తున్నందున విద్యార్థులకు సాధారణ విద్యతో పాటు, సాంకేతిక విద్య సైతం ఎంతో అవసరమని అన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలోని 10 మంది విద్యార్థులు బెస్ట్ టీఎల్‌ఎంల ద్వారా 200 ప్రదర్శనలు ఇవ్వడం అభినందనీయమన్నారు. స్టేట్‌లెవల్ ప్రదర్శనకు జిల్లా నుంచి ఎనిమిది మందిని ఎంపిక చేసి పంపిస్తామని డీఈవో రాము తెలిపారు. కిషన్‌రావుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు జి.మునీంద్ర ప్రదర్శించిన టీఎల్‌ఎం రాష్ట్రస్థాయి మేళాకు ఎంపికై నట్లు మండల విధ్యాధికారి బోనగిరి ప్రభాకర్ తెలిపారు. మునీంద్రను కలెక్టర్ సత్యప్రసాద్, డీఈవో కె.రాము అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.
గోదాముల వద్ద పటిష్ఠ భద్రత
ఈవీఎం గోదాముల వద్ద పటిష్ఠ భద్రత ఉందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం ధరూర్ క్యాంప్‌లోని ఈవీఎంల గోదాంలను పరిశీలించారు. నిత్యం అప్రమత్తతో పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, ఎన్నికల పర్యవేక్షకులు ఏవో హకీం, జగిత్యాల అర్బన్ తహసీల్దార్ రాంమోహన్ పాల్గొన్నారు.