
ర్యాగింగ్ చట్టరీత్యా నేరం
జగిత్యాలక్రైం: ర్యాగింగ్ చట్టరీత్య నేరమని, విద్యార్థి దశ ఎంతో విలువైనదని ఎస్పీ అశోక్‌కుమార్ సూచించారు. జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ర్యాగింగ్‌తో కలిగే దుష్ప్రభావాలపై మంగళవారం ఐఎంఏ హాల్‌లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు ర్యాగింగ్ వంటి అనైతిక చర్యలకు పాల్పడొద్దని, అలాంటివారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో చదువుకోవాలని పిలుపునిచ్చారు. ర్యాగింగ్ పెద్ద నేరమని, బాధిత విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ర్యాగింగ్ చేయడం వల్ల ఎంతో మంది విద్యార్థులు తమ భవిష్యత్‌ను కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. అలాంటివి జగిత్యాల జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదన్నారు. ర్యాగింగ్ నిరోధక చట్టం ప్రకారం జైలుశిక్ష, కళాశాల నుంచి బహిష్కరణ, స్కాలర్‌షిప్ రద్దు, ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం వంటి తీవ్ర శిక్షలు ఉంటాయన్నారు. ఎవరైనా ర్యాగింగ్ బాధితులుగా మారితే డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. కళాశాలలో యాంటి ర్యాగింగ్ కమిటిలను ఏర్పాటు చేయాలని అధ్యాపకులకు సూచించారు. అనంతరం ర్యాగింగ్‌తో కలిగే పరిణామాలపై విద్యార్థులను ప్రశ్నలు అడిగి, వారి అవగాహనను పరీక్షించారు. సమాధానం చెప్పిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. డీఎస్పీ రఘుచందర్, టౌన్ సీఐ కరుణాకర్, నర్సింగ్ కళాశాల సూపరింటెండెంట్ రాజ్‌గోపాల్ పాల్గొన్నారు.