
పొలాస శివారులో ఒకరి హత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం పొలాస.. గుల్లపేట గ్రామాల శివారులో జిల్లాకేంద్రంలోని సుతారిపేటకు చెందిన ఎండీ.నయీమోద్దీన్ (37) హత్యకు గురయ్యాడు. అతడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసి రోడ్డు పక్కనున్న నీటి కాల్వలో పడేసి వెళ్లారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నయీమోద్దీన్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి పాతబస్టాండ్ సమీపంలో ఇద్దరు వ్యక్తులను ఆటోలో ఎక్కించుకుని వెళ్లిపోయిన అతడు తిరిగి ఇంటికి వెళ్లలేదు. సోమవారం ఉదయం పొలాస, గుల్లపేట వెళ్లే రహదారిలో శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై సదాకర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సంఘటన స్థలానికి డాగ్‌స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ సిబ్బందిని రప్పించి అణువణువునా తనిఖీ చేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి సోదరుడు ఇసాకోద్దీన్ ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి పోలీసులతో మాట్లాడారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని కోరారు.

పొలాస శివారులో ఒకరి హత్య