
చరిత్రకు సాక్ష్యం ఎలగందుల ఖిలా
కొత్తపల్లి(కరీంనగర్): చరిత్రకు సాక్ష్యంగా కొత్తపల్లి మండలంలోని ఎలగందుల ఖిలా నిలుస్తోంది. కాకతీయులు, కులీకుతుబ్‌షాహీల శిల్ప కళావైభవానికి ప్రతీకగా ఖిలాలోని కట్టడాలు నిలుస్తున్నాయి. ఈ కోటలో టర్కీ, ఫ్రెంచ్ ఇంజినీర్ల ప్రభావం కనిపిస్తోంది. ఫ్రెంచి, టర్కీ ఇంజినీర్ల ప్రభావంతో ఈ కోట అనేక విషయాల్లో మధ్యయుగపు ఐరోపా శైలిని పోలి ఉంది. 200 అడుగుల ఎత్తు, 2.5 మైళ్ల విస్తీర్ణంలో మానేరునదిని ఆనుకొని ఉంది. ఎలగందుల కోటను కాకతీయులు 1083– 1323 మధ్య నిర్మించారు. ఈ కోటకు మొదటి పేరు ‘వెలిగుండుల’. దీనిని ముసునూరి నాయకులు, రాచర్ల పద్మనాయకులు ధృడంగా తయారు చేశారు. కోట చుట్టూ సుమారు 5 కిలోమీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతు నీటి కందకాన్ని తవ్వించి మొసళ్లతో నింపి శత్రువుల నుంచి రక్షణగా ఏర్పాటు చేశారు. 16వ శతాబ్దంలో ఈ కోటను కుతుబ్‌షాహీలు ఆక్రమించారు. తర్వాత మొఘల్ సామ్రాజ్యాధీనంలోకి వచ్చింది. హైదరాబాద్ నిజాం పాలనలో నిజాం ఉల్ ముల్క్ అసఫ్‌జాహి (1724–1748) కాలంలో అమీన్‌ఖాన్ ఈ కోట ఖిలేదార్‌గా బాధ్యతలు చేపట్టారు. 1754లో నవాబ్ సలాబత్ జంగ్ కాలంలో మీర్జా ఇబ్రహీం దంసా ఈ కోటను పునర్‌నిర్మించారు. 1905లో ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ జిల్లా కేంద్రాన్ని ఎలగందుల్ నుంచి కరీంనగర్‌కు మార్చారు. కోటలో నీలకంఠస్వామి, లక్ష్మీనరసింహస్వామి ఆలయాలతోపాటు మసీదు హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయి.
ఎలగందుల ఖిలా