
కోర్టులపై పెండింగ్ కేసుల భారం తగ్గిస్తున్నాం
జగిత్యాలజోన్: లోక్‌అదాలత్ ద్వారా వివిధ కేసులు పరిష్కరించి కోర్టులపై భారం తగ్గిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి తెలిపారు. ఈనెల 13న జిల్లాకోర్టులో నిర్వహించే జాతీయ మెగా లోక్‌అదాలత్‌పై విలేకరులకు వివరాలు వెల్లడించారు. చిన్నచిన్న విషయాలకు కోర్టు మెట్లు ఎక్కుతుండడంతో కేసుల సంఖ్య పెరిగిపోతోందన్నారు. సుప్రీం, హైకోర్టుల అదేశాల మేరకు లోక్‌అదాలత్ ద్వారా వీలైనన్ని కేసులు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, ధర్మపురి కోర్టుల్లో దాదాపు 17,300 వరకు క్రిమినల్, సివిల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇందులో రాజీకి అనుకూలమైనవి 8,687 కేసులు ఉన్నాయని, వీటిలో మూడు వేల కేసుల పరిష్కారం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. క్రిమినల్, సివిల్, మోటార్‌వాహనాలు, ఆస్తి తగాదాలు, చెక్‌బౌన్స్, భార్యాభర్తలు, కుటుంసభ్యుల మధ్య ఉన్న కేసులు పరిష్కరిస్తామని వివరించారు. విదేశాల్లో ఉన్నా.. నడవడానికి ఇబ్బంది పడేవారు రాజీ చేసుకుంటే ఆన్‌లైన్ ద్వారా పరిష్కరిస్తామన్నారు. ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించేందుకు పోలీస్, న్యాయవాదులతో సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా మొదటి అదనపు జడ్జి సుగళి నారాయణ మాట్లాడుతూ క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు లోక్‌అదాలత్‌లు చక్కని వేదికన్నారు. న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి వెంకటమల్లిక్ సుబ్రహ్మణ్యశర్మ మాట్లాడుతూ కోర్టుల వెంబడి ఏళ్ల తరబడి తిరగకుండా కేసులు పరిష్కరించుకోవాలని తెలిపారు.