
ఇసుక లింకులు తేటతెల్లం..!
స్థానిక రెవెన్యూ అధికారులపై అపనమ్మకం కరీంనగర్ విజిలెన్స్‌కు ఫిర్యాదులు అర్ధరాత్రి తనిఖీలు చేసిన అధికారులు టిప్పర్, మూడు లారీలు, ట్రాక్టర్ల పట్టివేత
కోరుట్ల: అక్రమ ఇసుక రవాణాదారులతో కోరుట్ల ఆర్డీవో పరిధిలోని కొంతమంది రెవెన్యూ సిబ్బందికి లింకులు ఉన్నాయన్న ప్రచారం జరుగుతున్న క్రమంలో ఇక్కడి నుంచి కరీంనగర్ విజిలెన్స్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో అక్కడి అధికారులు స్పందించి మంగళవారం అర్ధరాత్రి కోరుట్ల శివారులో ఓ ఇసుక టిప్పర్, మూడు లారీలు, మూడు ట్రాక్టర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసిన వారు స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వకపోవడానికి అక్రమ రవాణాదారులతో వీరికి ఉన్న లింకులేనన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
విజిలెన్స్‌కే ఎందుకు..?
కథలాపూర్ మండలం బొమ్మెన, తక్కళ్లపల్లి, సిరికొండ, కోరుట్ల మండలం నాగులపేట, సంగెం పరిసర ప్రాంతాల నుంచి ప్రతీరోజు 15 నుంచి ఇరవై లారీల్లో ఇసుక నిజామాబాద్, ఆర్మూర్, నిర్మల్ పరిసర ప్రాంతాలకు తరలుతోంది. ఈ విషయమై స్థానికులు పలుమార్లు స్థానిక రెవెన్యూ, పోలీసు సిబ్బందికి ఫిర్యాదు చేసినా పెద్దగా ఫలితం దక్కలేదు. దీనికి ఇసుక అక్రమార్కులతో స్థానిక రెవెన్యూ సిబ్బందికి లింకులు ఉన్నాయనే సందేహమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో స్థానిక అధికారులపై నమ్మకం లేక రెండురోజుల క్రితం కథలాపూర్, మేడిపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన కొంతమంది కరీంనగర్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు కోరుట్ల జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి సమయంలో తనిఖీలు నిర్వహించారు. ఏకంగా ఆరు లారీలు, ఓ టిప్పర్ ఇసుక లోడ్‌తో వెళ్తూ పట్టుబడటం గమనార్హం. ప్రతీరోజు జాతీయ రహదారి మీదుగా లారీలు, టిప్పర్లతో ఇసుక అక్రమంగా రవాణా అవుతున్నా.. ఈ పరిసరాల్లోకి రెవెన్యూ సిబ్బంది రాలేకపోయారు. కనీసం అధికారులకు ఏ మాత్రం సమాచారం లేకపోవడంపైనా కరీంనగర్ విజిలెన్స్ అధికారులు నివ్వెరపోయినట్లు సమాచారం.
కాసులు ఇస్తే సరి..
కోరుట్ల, కథలాపూర్ పరిసరాల నుంచి మూడు జిల్లాలకు అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నా రెవెన్యూ అఽధికారుల దృష్టిలో లేదనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఈ విషయం స్థానిక రెవెన్యూ సిబ్బందికి తెలిసినప్పటికీ అడపదడపా వాటిని పట్టుకుని అప్పటికప్పుడు కాసులు తీసుకుని వదిలేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాసులు ఇవ్వని వారి వాహనాలను పట్టుకుని ఆర్టీసీ డిపోకు తరలిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఈ విషయంలో మంగళవారం ఓ బీఆర్‌ఎస్ నేత కోరుట్ల ఆర్డీవోకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.