
లక్ష్యం ఘనం.. పనులు శూన్యం
కథలాపూర్: జగిత్యాల – నిజామాబాద్ జిల్లాల సరిహద్దుల్లో.. మండలంలోని భూషణరావుపేట శివారులో ఉన్న రాళ్లవాగు ప్రాజెక్టు, కాలువ పనులకు 2006లో అప్పటి ప్రభుత్వం రూ.18 కోట్లు మంజూరు చేసింది. దీనిద్వారా 3,500 ఎకరాలకు నీరందించాలనేది లక్ష్యం. ఏటా ప్రాజెక్టులో సమృద్ధిగా నీరుచేరి జలకళ సంతరించుకుంటుంది. కానీ.. కాలువలు పూర్తికాకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందడంలేదని రైతులు పేర్కొంటున్నారు. అప్పట్లో కాలువ పనులకోసం నిధులు మంజూరైనా ప్రభుత్వం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ పనులు పూర్తిచేయలేదు. ఏళ్లుగా కాలువ పనులు అసంపూర్తిగా ఉన్నా వాటిని పూర్తిచేయించకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆరు గ్రామాల్లో 3,500 ఎకరాలు
రాళ్లవాగు ప్రాజెక్టు నుంచి కుడికాలువ ద్వారా మండలంలోని భూషణరావుపేట, ఊట్‌పెల్లి, పెగ్గెర్ల, కథలాపూర్, మెట్‌పల్లి మండలం ఆత్మకూర్, నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్ గ్రామాల పరిధిలోని 3,500 ఎకరాలకు నీరందించాలన్నది లక్ష్యం. కుడికాలువకు అనుసంధానంగా ఐదు చిన్నకాలువలు ఏర్పాటు చేసి చివరి ఆయకట్టు రైతులకు నీరందించేలా ప్రణాళిక తయారుచేశారు. కాలువ పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తికాలేదు. కాలువకు అనుసంధానంగా ఐదు చిన్నకాలువలు ఏర్పాటు చేయాల్సి ఉండగా... ఊట్‌పెల్లి గ్రామాల భూములకు నీరందించే పనులు, భూషణరావుపేట, పెగ్గెర్ల గ్రామాల భూములకు నీరందించే పనులు అసంపూర్తిగా వదిలేశారు. పనులు పూర్తి చేయించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

లక్ష్యం ఘనం.. పనులు శూన్యం