
యూరియాకు ప్రత్యామ్నాయం నత్రజని
● తగ్గుతున్న యూరియా నిల్వలకు చెక్ ● వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు
రామగిరి(మంథని): వానాకాలం సాగు ప్రారంభమైంది. రైతులు పంటలు వేయడం, ఎరువులు సమకూర్చుకోవడంలో నిమగ్నమయ్యారు. అయితే, తక్కువ ధరకు లభించే యూరియాను పంట పొలాల్లో కుమ్మరిస్తున్నారు. మరికొందరు రాబోయే అవసరాలకు కూడా ఇప్పుడే అవసరానికి మించి కొనుగోలు చేసి నిల్వచేస్తున్నారు. దీంతో మార్కెట్‌లో డిమాండ్ పెరిగి నిల్వలు తగ్గి కొరత సమస్య ఏర్పడుతోంది. అయితే, వాస్తవ అవసరాల మేరకు ఎరువులు వాడితే సత్ఫలితాలు వస్తాయని కృషి రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం మృత్తిక శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ పిల్లి చెబుతున్నారు.
మోతాదుకు మించి యూరియా వద్దు
యూరియాలోని నత్రజని మిగతా పోషకాల కంటే పంటకు అధికంగా అవసరం. యూరియా పొలంలో వేసిన వెంటనే నీటిలో కరిగి భూమి లోపలి పొరలు, భూగర్భ జలాల్లోకి చేరి వృథా అవుతోంది. మరికొంత ఆవిరైపోతుంది. దీంతో 30 – 35 శాతమే మొక్కకు అందుతుంది. అవసరానికి మించి యూరియా వాడితే మొక్కలు పెలుసుబారి, పురుగులు ఆశించి వ్యాధులు వస్తాయి. పంటలకు యూరియాతోపాటు భాస్వరం, పొటాష్, సూక్ష్మపోషకాలు అవసరం. వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే రైతులు వీటి వినియోగానికి ఆసక్తి చూపడం లేదు. ఏ ఎరువైనా ఒకటే అనే మూసలో యూరియా కుమ్మరిస్తున్నారు.
ఇవి ప్రత్యామ్నాయం
పంటపై పిచికారీ చేసే ఎరువులు ప్రస్తుతం మార్కెట్‌లోకి వచ్చాయి. నానో యూరియా, నానో డీఏపీ నీటిలో కలిపి పిచికారీ చేసే 19:19:19, 20:20:20, రకం కాంప్లెక్స్ ఎరువులు, అధిక సాంధ్ర కలిగిన 13–0–45 (ఏఈ), ద్రవరూప నత్రజని వంటివి ఇందులో ఉన్నాయి. దుక్కిలో సిఫారసు మేరకు కాంప్లెక్స్ వేసుకొని, పైరుపై పిచికారీ చేసే ఎరువును స్ప్రే చేసుకుంటే తక్కుఖర్చు, తక్కువ ఎరువుల నష్టంతో మంచి ఫలితాలువ స్తాయి. ఉదా : వరిలో పిలకలు పెట్టే దశలో నానో యూరియా, నానో డీఏపీ, ఫార్ములా–4 కలిపి స్ప్రే చేసుకోవచ్చు. చిరుపొట్ట దశలో నానో యూరియా, 13–0–45 కలిపి స్ప్రే చేస్తే ఖర్చు తక్కువ వస్తుంది. చీడచీడల సమస్య తగ్గుతుంది.
యూరియా అతిగా వాడితే నష్టాలు ఇవే..
అవసరానికి మించి వేస్తే నేల నిస్సారమవుతుంది
పోషకాల సమతౌల్యత దెబ్బతింటుంది. సూక్ష్మపోషకాల లోపాలు అధికమవుతాయి.
మొక్కల్లో శాఖీయోత్పత్తి పెరిగి చీడపీడల ఉధృతి పెరుగుతుంది
భూగర్భ జలాలు నైట్రేట్, నత్రజనితో కలుషితమవుతాయి.
నేలలో ఉండి పంటకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య తగ్గుతుంది.
ఆమ్ల స్వభావం ఉండటంతో అధికంగా వాడితే భూమి ఆమ్ల నేలగా మారే ప్రమాదం ఉంది.

యూరియాకు ప్రత్యామ్నాయం నత్రజని