
సీఎంఆర్ అప్పగింతలో జాప్యం
జగిత్యాలరూరల్: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించి. తిరిగి మిల్లర్ల నుంచి సీఎంఆర్ రూపంలో సేకరిస్తుంది. బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగిస్తుంది. అయితే జిల్లాలో మిల్లర్లు ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని మాత్రం తిరిగి అప్పగించలేదు. జాప్యం చేస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం వెనుకడుగువేస్తోంది. బియ్యం అప్పగించకుండా జాప్యం చేస్తున్న మిల్లులకు ఇటీవల సివిల్‌సప్‌లై అధికారులు ధాన్యం కేటాయించలేదు. అయితే రాజకీయ ఒత్తిడి తెచ్చి ధాన్యం కేటాయించుకున్నారు. జిల్లాలో ప్రభుత్వానికి ఈనెల 27 వరకు 28 మంది రైస్‌మిల్లర్లు 25,448 మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. ఇప్పటి వరకు 55 మంది రైస్‌మిల్లర్లు 100 శాతం బియ్యాన్ని అప్పగించారు.
2023–24కు ధాన్యం కేటాయింపు
జిల్లాలో 2023–24కు గాను యాసంగిలో ప్రభుత్వం 4,05,477 టన్నుల ధాన్యం సేకరించింది. దానిని 23 మంది రైస్‌మిల్లర్లకు కేటాయించగా ఇప్పటివరకు 2,75,349 టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉండగా.. 2,49,901 టన్నులు అప్పగించారు. ఇప్పటివరకు 55 మంది రైస్‌మిల్లర్లు 100 శాతం బియ్యాన్ని అప్పగించగా.. 28మంది రైస్‌మిల్లర్లు 25,448 టన్నుల బియ్యాన్ని అప్పగించాల్సి ఉంది. ఈనెల 27 వరకు అప్పగించకపోతే డిఫాల్టర్లుగా ప్రకటించే అవకాశం ఉంది. డిఫాల్టర్లుగా తేలిన మిల్లర్లకు వచ్చే సీజన్‌లో ధాన్యం కేటాయించరు.
బియ్యం అప్పగించేలా చూస్తున్నాం
– జితేంద్రప్రసాద్, డీఎం
ప్రభుత్వ ఆదేశాల మేరకు 55 మంది రైస్‌మిల్లర్లు వందశాతం బియ్యం అప్పగించారు. మరో 28 మంది ఈనెల 27 వరకు 25,448 టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. కలెక్టర్, అదనపు కలెక్టర్ మిల్లర్లతో సమావేశమై బియ్యం అప్పగించేలా చర్యలు చేపడుతున్నారు.
మిల్లర్ల వద్ద 25,448 టన్నుల ధాన్యం
బియ్యం అప్పగింతకు ఈనెల 27చివరి తేదీ