
ఎమ్మెల్యే వర్సెస్ మాజీమంత్రి
● మంజూరు పత్రాల పంపిణీలో గందరగోళం
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బుధవారం నామమాత్రంగా పట్టాల పంపిణీ చేపట్టారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ కమిటీల్లో ఒక్కో గ్రామానికి ఆరుగురు సభ్యులను నియమించారు. ఇదులో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వర్గంలో ముగ్గురు, మాజీమంత్రి జీవన్‌రెడ్డి వర్గంలో ముగ్గురికి కమిటీలో చోటు కల్పించారు. అయితే బుధవారం పంపిణీ చేసిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో అధికారులు ఎమ్మెల్యే నియమించిన కమిటీ సభ్యులకు మాత్రమే సమాచారం అందించారు. కార్యక్రమానికి 10 నిమిషాల ముందు జీవన్‌రెడ్డి వర్గ కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారంతా ఎంపీడీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోతె గ్రామంలో ఎమ్మెల్యే నియమించిన కమిటీ సభ్యులు ఎంపిక చేసిన వారికి మంజూరు పత్రాలు రాగా.. మాజీమంత్రి జీవన్‌రెడ్డి నియమించిన కమిటీ సభ్యులు సూచించిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు రాకపోవడంపై కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కమిటీ సభ్యులకు సకాలంలో సమాచారం ఇవ్వకపోవడంపై ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులపై కమిటీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటి రెండు రోజుల్లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.