
గడ్డిమందు తాగి వ్యక్తి ఆత్మహత్య
కోరుట్లరూరల్: పట్టణానికి చెందిన అరిసె గంగ నర్సయ్య (59) సోమవారం రాత్రి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై చిరంజీవి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం అరిసె గంగనర్సయ్యకు మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తలకు దెబ్బ తగలడంతో అప్పటినుంచి మతి మరుపుతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి కుమారుడు అరిసె రాజేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు ఎస్సై చిరంజీవి తెలిపారు.
విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృతి
మెట్‌పల్లి: పట్టణంలోని ఆరపేట శివారులో మిషన్ భగీరథ పైపులైన్ పనుల వద్ద కరెంట్ షాక్ తగిలి బయ్యని నవీన్‌కుమార్ (28) అనే కార్మికుడు మృతి చెందాడు. ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా సర్జల్‌పూర్‌కు చెందిన నవీన్‌కుమార్ కొంతకాలంగా ఓర్సు ఏడుకొండలు అనే కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్నాడు. ప్రస్తుతం ఆరపేట శివారులో భగీరథ పైపులైన్ పనులు చేపట్టాడు. మంగళవారం అక్కడ పైపులకు వెల్డింగ్ చేస్తుండగా నవీన్‌కుమార్ ప్రమాదవశాత్తు జారి పక్కనే ఉన్న కరెంట్ స్విచ్ బోర్డుకు తగిలాడు. షాక్ తగిలి కింద పడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
18న జాబ్ మేళా
కరీంనగర్: జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు కరీంనగర్‌లోని కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్‌లో ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 18న జిల్లా ఉపాఽధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. కృషివిజ్ఞాన్ ఫర్టిలైజర్ సంస్థలో సెల్స్ ఎగ్జిక్యూటివ్, ఫీల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్, హెచ్‌ఆర్, ఆఫీస్ బాయ్ 60 పోస్టులు ఉన్నాయని, పోస్టులకు 10వ తరగతి, డిగ్రీ, ఎంబీఏ, బీఎస్సీ అగ్రికల్చర్, డిప్లొమా ఆపై చదివిన ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని తెలిపారు. 19– 35 సంవత్సరాలోపు ఉండాలని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో జిల్లా ఉపాఽధి కార్యాలయంలో తమ పేరు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9666100349, 9963177056 నంబర్లను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.
కిరాణషాపులో దొంగతనం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని గొల్లపల్లి గ్రామంలోని కిరాణదుకాణంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపారు. బైరి నరేశ్ గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద కిరాణ దుకాణం నిర్వహించుకుంటున్నాడు. మధ్యాహ్నం వేళ భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లి తిరిగి వచ్చి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. దుకాణంలోని కౌంటర్ నుంచి రూ.3వేలు, ఆలయానికి చెందిన మూడు ఇత్తడి చెంబులు, ఇత్తడి తాంబూలం చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మెడికల్ షాప్ యజమాని రిమాండ్
వేములవాడ: మైనర్ బాలికకు గర్భస్రావం(అబార్షన్) అయ్యేలా మందులు విక్రయించిన మెడికల్‌షాప్ యజమానిని రిమాండ్‌కు తరలించినట్లు వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి మంగళవారం తెలిపారు. ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి తెలిపిన వివరాలు. సిరిసిల్లకు చెందిన ఓ యువకుడు ప్రేమ, పెళ్లి పేరుతో మైనర్ బాలికను శారీరకంగా వాడుకుని గర్భవతిని చేశాడు. గర్భస్రావం కావడానికి సిరిసిల్ల పట్టణానికి చెందిన గీతాంజలి మెడికల్ షాప్ యజమాని నల్లా శంకర్ మందులు ఇచ్చాడు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వగా బాలికకు గర్భస్రావమైంది. కేసు నమోదు చేసి సదరు యువకుడిని మే 30న రిమాండ్‌కు తరలించారు. చట్ట వ్యతిరేకంగా మైనర్ బాలికకు గర్భం పోవడానికి మందులు ఇచ్చిన గీతాంజలి మెడికల్ షాప్ యజమాని శంకర్‌ను ఈనెల 12న రిమాండ్‌కు తరలించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.