● వినాయకుడి విగ్రహం జరుపుతుండగా ప్రమాదం
● విగ్రహం మీదపడి దెబ్బతిన్న మెడ నరాలు
● అచేతన స్థితిలో ఆస్పత్రిలో యువకుడు
● ఆపరేషన్‌కు రూ.10లక్షలు అవసరం
● ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
వీణవంక: వారిది పేద కుటుంబం. తల్లిదండ్రులకు చేదోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాడా యువకుడు. ఇంటికి దూరమైనా వినాయక విగ్రహాల తయారీ పనుల్లో కూలీగా చేరాడు. విగ్రహం జరుపుతుండగా ప్రమాదశాత్తు మీద పడటంతో మెడనరాలు దెబ్బతిని ఆస్పత్రి పాలయ్యాడు. కాళ్లు, చేతులు పనిచేయక, అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆపరేషన్‌కు రూ.10 లక్షలు అవసరం కాగా.. ఆ పేద కుటుంబం దిక్కుతోచని ిస్థితిలో ఉండిపోయింది. బాధిత కుటుంబం వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన సుద్దాల రవీందర్– శారద దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. రవీందర్ గీత కార్మికుడు. కుటుంబానికి ఆయనే ఆధారం. ఈ పరిస్థితుల్లో చిన్న కొడుకు అజయ్(26) కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు మూడేళ్లుగా వరంగల్ జిల్లా పరకాలలో వినాయక విగ్రహాల తయారీకేంద్రంలో కూలీగా పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం వినాయకుడి విగ్రహం జరుపుతుండగా, ప్రమాదవశాత్తు విగ్రహం అజయ్ మెడపై పడింది. మెడ నరాల కింద ఉన్న బొక్క విరిగిపోయింది. నరాలు చచ్చుపడిపోవడంతో కాళ్లు, చేతులు పని చేయక ఆపస్మారకస్థితిలోకి వెళ్లాడు. వెంటనే హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్య ఖర్చులు, ఆపరేషన్‌కు రూ.10 లక్షలు అవుతుందని వైద్యులు తెలుపడంతో బాధిత కుటుంబం అప్పులు చేసి ఇప్పటికే రూ.4 లక్షలు ఖర్చురచేశారు. ఇంకా రూ.6లక్షలు అవసరం కావడంతో దిక్కుతోచన స్థితిలో ఉన్నారు. చేతిలో చిల్లిగవ్వ లేదని, పూట గడవడమే కష్టంగా ఉందని అజయ్ తండ్రి రవీందర్ కన్నీరుమున్నీరయ్యాడు. దాతలు సాయం అందించి, అజయ్‌ని కాపాడాలని వేడుకుంటున్నాడు. ఎవరైనా సాయం చేయాలనుకుంటే 97013 14308, 81067 62881 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరుతున్నారు.