
పొదుపు.. అభివృద్ధి
● వీధి వ్యాపారుల సంఘాల ఏర్పాటు ● బ్యాంకు నుంచి లింకేజీ రుణాలు ● చర్యలు తీసుకుంటున్న అధికారులు ● సాధికారత సాధించే దిశగా అడుగులు
జగిత్యాల: మున్సిపాలిటీల్లో ఉన్న వీధి వ్యాపారుల పొదుపు సంఘాలను ఏర్పాటు చేసేందుకు మెప్మా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మహిళాసంఘాలకు మాత్రమే పొదుపు సంఘాలు ఉండేవి. తాజాగా చిరువ్యాపారాలు చేసుకునే పురుషులకు కూడా జాతీయ పట్టణ ఉపాధి పథకం కింద పొదుపు సంఘాలు (కామన్ ఇన్‌ట్రెస్ట్ గ్రూప్స్) ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే చిరు వ్యాపారం చేసుకుంటున్న మహిళలు మహిళాసంఘాల్లో పొదుపు చేసుకుంటున్నారు. కానీ పురుషులకు ఎలాంటి అవకాశాలు లేవు. తాజాగా వారికి కూడా గ్రూప్స్ ఏర్పాటు చేసి వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ పొదుపు సంఘాల ద్వారా వ్యాపారులు ప్రతినెలా పొదుపు చేసుకుని బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం ఉంది.
కొనసాగుతున్న సర్వే..
జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ బల్దియాల్లో అనేక మంది చిరు వ్యాపారులు ఉన్నారు. వీరంతా చిన్నచిన్న వ్యాపారులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నాయి. ఇలాంటి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందులోభాగంగా వీధివ్యాపారుల కోసం సర్వే కూడా చేస్తున్నారు. ఈ ఐదు మున్సిపాలిటిల్లో 173 పొదుపు సంఘాలను ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా మెప్మా అధికారులు సర్వే చేసి గ్రూప్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్పీల సహాయంతో పట్టణంలో సర్వే చేస్తున్నారు. ఇప్పటికే వీరికి గుర్తింపు కార్డులు కూడా అందించారు. నెల రోజుల్లోపు సంఘాలను ఏర్పాటు చేసి వారికి వ్యాపారాల్లో చేయూతనందించేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా తోపుడుబండ్లు, సంచారం, నడుచుకుంటూ వెళ్లి వ్యాపారం చేసుకునేవారిని గుర్తించనున్నారు. మహిళాసంఘాల మాదిరిగానే వీరు కూడా ఒక్కో సంఘంలో 10–12 మంది సభ్యులుగా ఉంటారు. వీరందరికీ మొదట బ్యాంకుల్లో ఖాతాలు తీయించి అనంతరం పొదుపు చేయించి లింకేజీ రుణాలు అందిస్తారు. కరోనా సమయంలో వీధి వ్యాపారుల జీవనం రోడ్డున పడటంతో పీఎం స్వనిధి కింద రుణాలు అందజేశారు. మొదట విడత రూ.10 వేలు, రెండో విడతలో రూ.20 వేలు, మూడో విడతలో రూ.50 వేల చొప్పున ఎంపిక చేసి వారికి రుణాలు అందించారు. ఆ కిస్తీలు ఇప్పటికీ చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఆ రుణాలతో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఎంతో తోడ్పటు కలిగింది. కానీ తాజాగా వీటిని నిలిపివేశారు. ప్రస్తుతం ఈ గ్రూపులను ఏర్పాటు చేసి వారికి ఆర్థిక చేయూతనందించేలా చర్యలు చేపడుతున్నారు. మొదట గ్రూపులను ఏర్పాటు చేసిన అనంతరం వారికి బ్యాంక్ లింకేజీ రుణాలు ఇప్పించి మరింత పెద్ద వ్యాపారాలు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎంపిక చేసిన అనంతరం వారికి శిక్షణ ఇవ్వనున్నారు. ఇవే కాకుండా పొదుపు సంఘాల్లో చేరిన ప్రతి సభ్యునికి రూ.2 లక్షల బీమా సౌకర్యం సైతం కల్పించనున్నారు.
తప్పనున్న వడ్డీ
వ్యాపారుల బెడద
గతంలో చిరువ్యాపారులు ఎక్కువ శాతం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకునే వారు. నిత్యం అప్పు ఇచ్చిన తర్వాత నిత్యం డైలీ ఫైనాన్స్ కింద వసూలు చేసేవారు. ఇలా వారు చేసిన కష్టమంతా వారికే పోయేది. ప్రభుత్వం ఈ పీఎం స్వనిధితో పాటు, పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి బ్యాంక్ లింకేజీ రుణాలు అందించడం ద్వారా వారికి ఎలాంటి ఇబ్బందులూ ఉండకపోవడంతో పాటు వ్యాపారాల్లో సాధికారత సాధించే అవకాశం ఉంది.
బల్దియా గ్రూపులలక్ష్యం వీధివ్యాపారులు జగిత్యాల 70 6,825
కోరుట్ల 44 4,188
మెట్‌పల్లి 38 3,713
ధర్మపురి 11 982
రాయికల్ 10 924
మొత్తం 173 16,632
గ్రూపులతో మేలు
వీధివ్యాపారులతో పొదుపు సంఘాలను ఏర్పాటు చేయిస్తున్నాం. వీరికి ఎంతో మేలు జరుగుతుంది. సంఘంలో పొదుపు చేసుకుని అనంతరం బ్యాంకుల ద్వారా రుణం పొందవచ్చు. కుటుంబాలను పోషించవచ్చు.
– శ్రీనివాస్, మెప్మా ఏవో

పొదుపు.. అభివృద్ధి