
క్రిప్టో పాపాలు కోకొల్లలు!
బాధితులు ముందుకు రావాలి
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ కేంద్రంగా వెలుగుచూసిన మెటా క్రిప్టో దందా రోజుకో మలుపు తిరుగుతోంది. వాస్తవానికి ఇందులో జరుగుతున్న మోసాలపై బాధితులు నగరంలోని పలు ఠాణాల్లో ఇప్పటికే ఫిర్యాదులు చేసినా.. పోలీసులు పట్టించుకోకపోవడంతో పాపాల పుట్ట ఆలస్యంగా బద్దలవుతోంది. తొండ ముదిరి ఊసరవెల్లిగా మారినట్లు.. మెటా ఫండ్ పేరుతో మొదలైన క్రిప్టో దందా.. రెండు నెలలకే మెటా ప్రో అని పేరు మార్చుకుంది. అదేంటంటే సాంకేతిక మార్పులు అని సర్దిచెప్పారు. ఇక మొత్తం వ్యవహారంలో నగరంలోని ఓ టింబర్ డిపో యజమాని, ఓ మొబైల్‌షాప్ ఓనర్, ఓ మాజీ కార్పొరేటర్ ముగ్గురు రూ.కోట్లలో అమాయక ప్రజల నుంచి రూ.కోట్లు వసూలు చేశారు. ఇక ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి లోకేశ్ ఏపీకి చెందిన వాడని కొందరు, ఆయన పూర్వీకులు సిద్దిపేటకు చెందిన వారని మరికొందరు బాధితులు చెబుతున్నారు. వీరంతా పథకం ప్రకారం.. అమాయక ప్రజలకు డబ్బులు రెట్టింపు అవుతాయని ఆశ చూపించి..వారి నుంచి రూ.కోట్లు వసూలు చేసి ఇపుడు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.
పట్టించుకోని పోలీసులు..
నగరంలోని తీగలగుట్టపల్లి సమీపంలోని ఓ టింబర్ డిపోయజమాని, కోర్టు సమీపంలోని ఓ మొబైల్ షాప్ యజమాని, మాజీ కార్పొరేటర్ ముగ్గురూ ఒకే సామాజికవర్గం. వీరు అంతా కలిసి లోకేశ్‌ను కరీంనగర్‌కు పలుమార్లు తీసుకువచ్చి.. టింబర్ డిపోలో సమావేశాలు నిర్వహించి.. కేవలం మూడు నెలల్లో డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మబలికి రూ.లక్షలు వసూలు చేశారు. ఒక దశలో ఓ కస్టమర్ కోసం వేములవాడ వెళ్లి మరీ రూ.16 లక్షలు ఒత్తిడి చేసి తీసుకున్నారు. శామీర్‌పేటలోని రిసార్ట్‌లో పలు సమావేశాలు పెట్టారు. వాటికి ప్రముఖ యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్, అరబ్‌షేక్ వేషధారణలో ఉన్నవారిని తీసుకువచ్చి పెట్టుబడులు ఆకర్షించారు. అక్కడి ఆర్భాటాలు, బౌన్సర్ల హడావుడి, హంగామా చూసిన పలువురు బుట్టలోపడి వారు అడిగినంత చెల్లించారు. బదులుగా అందరికీ మొబైల్‌లో యాప్ వేసిచ్చి డిజిటల్ డాలర్లు ఇచ్చామని చేతులు దులుపుకున్నారు. సరిగ్గా రెండు నెలల తరువాత బాధితులంతా మోసపోయామని గ్రహించారు. ఈ వ్యవహారంపై టూ టౌన్‌లో, త్రీ టౌన్‌లో బాధితులు పిటిషన్లు ఇచ్చినా.. అవి కేసుల దాకా పోలేదు.
– గౌస్ ఆలం, కరీంనగర్ సీపీ
లోకేశ్‌ను పదే పదే కరీంనగర్‌కు తీసుకువచ్చి.. మొబైల్‌షాప్ యజమాని, టింబర్ డిపో ఓనర్లు రూ.కోట్లల్లో వసూలు చేశారు. ఇందుకోసం జ్యోతి నగర్‌లోని ఓల్డ్ డీఐజీ కార్యాలయంలో ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ నుంచే మెటా క్రిప్టో ఆపరేట్ చేస్తున్నారు. పేరుకు క్రిప్టో కరెన్సీ అని చెబుతున్నప్పటికీ వాస్తవానికి ఇది మల్టీ లెవల్ మార్కెటంగ్ తరహాలోనే తమను మోసం చేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ విషయమై బాధితులు నెమ్మదిగా బయటికి వస్తున్నారు. తమకు నిందితులు ఇచ్చిన ఫ్రాంసరీ నోట్లు, చెల్లని చెక్కులు తదితరాలను ‘సాక్షి’కి పంపుతున్నారు. నేరుగా సీపీకే ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై సీపీ గౌస్ ఆలం కూడా సీరియస్‌గానే ఉన్నారు. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే... తప్పకుండా కేసు నమోదు చేసి చర్యలు చేపడతామని భరోసా ఇస్తున్నారు.
మెటా ఫండ్‌తో మొదలై మెటాప్రో అవతారం ఎదురుతిరిగిన బాధితులకు చెల్లని చెక్కులు జారీ ‘సాక్షి’కి చెక్కులు, ప్రామిసరీ నోట్లు పంపుతున్న బాధితులు టింబర్ డిపో, మొబైల్‌షాప్ యజమానులు, మాజీ కార్పొరేటర్ కీలకం
అరబ్‌షేక్‌లు, యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్లను చూపి పెట్టుబడులు

క్రిప్టో పాపాలు కోకొల్లలు!