
అడవిపై గొడ్డలి వేటు
రాయికల్: చెట్లు పెంచాలి.. అడవులను రక్షించా లి.. హరితవనానికి కృషి చేయాలి.. ఇది ప్రభుత్వ విధానం. కానీ.. అందుకు విరుద్ధంగా రాయికల్ రేంజ్‌లోని కొంత మంది అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. అటవీశాఖ అధికారుల ఉదాసీనతతో భారీ చెట్లను నరికి రాత్రి వేళల్లో కలపను తరలిస్తున్నారు. రాయికల్ రేంజ్ పరిధిలో రాయికల్, మల్లాపూర్ మండలాలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 11 వేల హెక్టార్లలో అటవీ విస్తీర్ణం ఉంది. రాత్రిపూట కలపను అక్రమంగా తరలించేందుకు కొంతమంది స్మగ్లర్లు అటవీశాఖ సిబ్బందిని మచ్చిక చేసుకుంటున్నారు. వారి అండదండలతో ఉదయం పూట చెట్లను నరుకుతూ.. రాత్రి సమయంలో గుట్టుచప్పుడు తరలిస్తున్నారు.
పర్యవేక్షణ లోపంతో..
రాయికల్ రేంజ్ పరిధిలోని దావన్‌పల్లి, వస్తాపూర్, బోర్నపల్లి, చింతలూరు, కొత్తపేట, వీరాపూర్, పోరుమల్ల, అయోధ్య, ఆలూరు అటవీ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఉదయం చెట్లను నరికేస్తూ కలపను రాత్రులపూట ద్విచక్ర వాహనాల ద్వారా జగిత్యాల, కోరుట్ల, రాయికల్‌కు తరలిస్తున్నారు. బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, చౌకీదార్ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా నడుస్తోందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
అటవీశాఖలో సిబ్బంది కొరత.. చెక్‌పోస్టులు లేక రవాణా
రాయికల్ రేంజ్ పరిధిలో 15 బీట్‌లు ఉన్నాయి. ఒక్కో బీట్‌కు ఒక్కో బీట్ ఆఫీసర్ ఉండాలి. కేవలం ఆరుగురు బీట్ ఆఫీసర్లు మాత్రమే ఉన్నారు. ఐదుగురు సెక్షన్ ఆఫీసర్లకు నలుగురు మాత్రమే ఉన్నారు. మొబైల్ పార్టీ సెక్షన్ ఆఫీసర్ పోస్టు పూర్తిస్థాయిలో ఖాళీగా ఉంది. కలప రవాణా నియంత్రణ కోసం బోర్నపల్లి, దావన్‌పల్లి, జగిత్యాలలో చెక్‌పోస్టులను అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల్సి ఉండగా.. అనుమతులు రాకపోవడంతో అక్రమ రవాణాదారులు ఇదే అదునుగా భావించి గోదావరితీరమైన బోర్నపల్లి నుంచి మల్లాపూర్ మండలానికి నిర్మల్ జిల్లా కడెం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించినప్పటికీ అటవీశాఖ నుంచి అనుమతులు రాకపోవడం.. కొత్త సిబ్బందిని నియమించకపోవడంతో ఉన్న వారితోనే నెట్టుకురావాల్సి వస్తోంది. సిబ్బందిపై పనిభారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎఫ్‌వో స్పందించి కలప అక్రమ రవాణా నియంత్రణకు సరిహద్దుల ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించాలని అటవీ ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
కలపను తరలిస్తున్న స్మగ్లర్లు
అటవీశాఖను వేధిస్తున్న సిబ్బంది కొరత
రాయికల్ రేంజ్‌లో కనిపించని చెక్‌పోస్టులు
రాత్రివేళ వాహనాలపై తరలిస్తున్న అక్రమార్కులు
చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అటవీశాఖ అధికారులు
అక్రమ రవాణా చేస్తే చర్యలు
అడవిలో చెట్లు నరకడం నేరం. కలపను తరలించడం.. చెట్లు నరికివేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రాత్రివేళ పెట్రోలింగ్ చేపట్టి అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తాం. ఎవరైనా కలప రవాణా చేస్తే సమాచారం అందించాలి. పేర్లు గోప్యంగా ఉంచుతాం. ఉన్నతాధికారుల అనుమతులు రాగానే చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం.
– భూమేశ్, ఎఫ్‌ఆర్వో

అడవిపై గొడ్డలి వేటు

అడవిపై గొడ్డలి వేటు