
అధికారులు సమన్వయంతో పని చేయాలి
● భక్తులకు ఇబ్బంది కలుగకుండా చూడాలి ● కలెక్టర్ సత్యప్రసాద్
మల్యాల: హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా కొండగట్టుకు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. బుధవారం మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల నిర్వహణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. చలివేంద్రాల ఏర్పాటు, వైద్య సదుపాయం అందుబాటులో ఉండేలా వైద్యశిబిరాలతో పాటు 108 వాహనం సిద్ధంగా ఉండాలని సూచించారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ అశోక్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ రఘువరణ్, ఆర్డీవో మధుసూదన్, ఈవో శ్రీకాంత్‌రావు, డీఎస్పీ రఘుచందర్, ఎంపీడీవో స్వాతి, తహసీల్దార్ మునీందర్, సీఐ రవి, వివిధ విభాగాల అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
జగిత్యాలరూరల్: జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం జగిత్యాలరూరల్ మండలంలోని చల్‌గల్ ఏఎంసీ, మోరపల్లి, బాలెపల్లి గ్రామాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతుందని, తేమ శాతం వచ్చిన ధాన్యంను వెంటనే తూకం వేసి రైస్‌మిల్లులకు తరలిస్తున్నామని అన్నారు. వడగళ్ల వర్షం పడే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉన్న టార్పాలిన్‌లను రైతులకు అందజేయాలని సూచించారు. ప్రతీరోజు మిల్లులకు రవాణా నిమిత్తం లారీల కోరత లేదన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.