
భగీరథ.. కొరవడిన భద్రత
● పంపుహౌజ్ చుట్టూ ప్రహరీ ఏర్పాటులో నిర్లక్ష్యం ● పిచ్చిమొక్కలు, లీకేజీ నీటితో అధ్వానంగా పరిసరాలు ● వసతులు లేక సిబ్బందికి ఇబ్బందులు
మెట్‌పల్లి(కోరుట్ల): పట్టణంలో మిషన్ భగీరథ నీటి విషయంలో మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. రోజూ వేలాది ఇండ్లకు ఈ నీటిని సరఫరా చేస్తున్న పంపుహౌజ్ వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, దీనిని నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో భగీరథ నీటి వినియోగంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
నిత్యం 90లక్షల లీటర్ల నీటి సరఫరా
● పట్టణంలోని మండల పరిషత్‌కు చెందిన స్థలంలో మిషన్ భగీరథ పంపుహౌజ్ నిర్మించారు. ఇందులో భాగంగా అక్కడ ఒక సంపు, రెండు ఓవర్ హెడ్ ట్యాంకులను ఏర్పాటు చేశారు.
● డబ్బా రిజర్వాయర్ నుంచి నేరుగా ఇక్కడి సంప్‌లోకి నీటిని పంపించి, అక్కడి నుంచి ట్యాంకులకు, ఆ తర్వాత వాటి ద్వారా ఇండ్లలోని నల్లాలకు సరఫరా చేస్తున్నారు.
● స్థానికంగా 26వార్డులు ఉండగా, వీటిలో పది వేలకు పైగా నల్లాలు ఉన్నాయి. ప్రస్తుతం రోజూ 90లక్షల లీటర్ల నీటిని నల్లాల ద్వారా అందిస్తున్నారు.
● అయితే ఇంత పెద్ద మొత్తంలో నీటిని సరఫరా చేసే పంపుహౌజ్ వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఎన్నో సమస్యలు..
● పంపుహౌజ్ రక్షణ దృష్ట్యా ఇతరులు లోపలికి చొరబడకుండా ఉండడానికి చుట్టూ ప్రహరీ నిర్మించాలి. కానీ ఇది లేకపోవడం వల్ల పలువురు బస్‌స్టేషన్ నుంచి తహసీల్దార్ కార్యాలయానికి దీని మీదుగానే నడుచుకుంటూ వెళ్తున్నారు.
● అలాగే పరిశుభ్రత చర్యలు చేపట్టకపోవడం వల్ల పరిసరాలు పిచ్చి మొక్కలు, చెత్తతో నిండిపోయాయి. ఓవర్ హెడ్ ట్యాంకుల కింద పనులు పూర్తి చేయకుండా వదిలేశారు. దీంతో లీకేజీ నీటితో పాటు వరద నీరు ట్యాంకుల కిందకు వచ్చి చేరుతోంది.
● వీటివల్ల దోమలు వ్యాప్తి చెందడమే కాకుండా పరిసరాలు దుర్గంధం వెదజల్లుతున్నాయి.
● నీటి సరఫరాను పర్యవేక్షించడానికి అక్కడ పంపు ఆపరేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. వారికి గదితో పాటు ఇతర వసతులను ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధికారుల తీరుపై విమర్శలు
● తరుచూ పంపుహౌజ్ పరిశీలనకు వచ్చే ఇంజినీరింగ్ విభాగం అధికారులు అక్కడ వెంటనే పరిష్కరించే అవకాశమున్న సమస్యలపై దష్టి సారించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిసరాలను మున్సిపల్ పారిశుధ్య సిబ్బందితో శుభ్రం చేయించవచ్చు. కానీ, అలా చేయడం లేదు. ఒక ఓవర్ హెడ్ ట్యాంకుకు చాలా రోజుల క్రితం లీకేజీలు ఏర్పడి భారీగా నీరు వృథాగా పోతుంది. దీనికి మరమ్మతులు చేపట్టకుండా నిర్లక్ష్యం చూపుతున్నారు.
రూ.50 లక్షలు కేటాయించాం
పంపుహౌజ్ వద్ద పలు పనులు చేపట్టడం కోసం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.50లక్షలు కేటాయించాం. వీటికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. అనుమతి రాగానే ప్రక్రియను మొదలుపెడుతాం. ట్యాంకు లీకేజీలకు మరమ్మతు చేపట్టాలంటే రెండు రోజుల పాటు నీటి సరఫరాను నిలిపివేయాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని వేసవి తర్వాత ఆ పనులు చేయాలని నిర్ణయించాం.
– నాగేశ్వర్‌రావు, మున్సిపల్ డీఈఈ

భగీరథ.. కొరవడిన భద్రత

భగీరథ.. కొరవడిన భద్రత