
తలసేమియా వ్యాధి అరికట్టేందుకు చర్యలు
జగిత్యాల: తలసేమియా వ్యాధిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్త పరీక్షలు చేస్తున్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రోగ్రాం ఆఫీసర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ తెలిపారు. తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈనెల 12వ తేదీలోపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, పెళ్లికి ముందు సికెల్‌సెల్ ఎనిమియాకు సంబంధించిన వైద్య పరీక్షలు చేసుకుని వ్యాధి బారిన పడకుండా చూసుకోవాలన్నారు. ప్రతి 100 మందిలో ఐదుగురికి తలసేమియా, సికిల్‌సెల్ ఎనిమియా వ్యాధి బాధితులు ఉన్నారని, వ్యాధి ఉన్న వారిని పెళ్లి చేసుకోకూడదని, ఒకవేళ చేసుకుంటే పుట్టబోయే పిల్లలు 25శాతం వ్యాధిగ్రస్తులు అవుతారని వివరించారు. అలాంటి వారికి ప్రతి 15రోజులకోసారి రక్తం ఎక్కించాలని, ఖరీదైన వైద్యం చేయించాల్సి వస్తుందన్నారు. వ్యాధిని సకాలంలో గుర్తిస్తే నిర్మూలించవచ్చని పేర్కొన్నారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ వ్యాధి మూడు దశల్లో కనిపిస్తుందని, మేజర్ పిల్లల్లో హిమోగ్లోబిన్ తగ్గిన వారికి రక్తం ఎక్కించాల్సి ఉంటుందన్నారు. ప్రతి 15 రోజులకోసారి రక్తం అవసరం ఉంటుందని, జ్వరం రావడం, ఆకలి తగ్గడం, కామెర్లు, మూత్రం పసుపు రంగులో రావడం, ఇలా రకరకాల ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. మొదటి నుంచే పరీక్షలు చేసుకుని వ్యాధిని అరికట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు సమియోద్దీన్, శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, సతీశ్ పాల్గొన్నారు.