
ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఒకేకుటుంబానికి చెందిన ఆకుల మంగమ్మ,
వెల్గటూర్(ధర్మపురి): తన తల్లి అస్థికలను ధర్మపురి గోదావరి నదిలో కలిపేందుకు మినీ బస్సులో బయలు దేరిన మెదక్ జిల్లా గజ్వేల్ మండలం బేజ్‌గామ్ గ్రామానికి చెందిన ఆకుల దేవేందర్, తన 25మంది కుటుంబసభ్యులు కొత్తపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇందులో బస్సు డ్రైవర్ పగిల్ల మల్లయ్య(50) మృతి చెందగా మిగతా వారు తీవ్రగా గాయపడ్డారు. ఇందులో 15మంది కాళ్లు, చేతులు విరిగాయి. మిగతా వారు స్పల్పంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఆకుల దేవేందర్ తల్లి అనసూయ ఇటీవల చనిపోయింది. ఆమె అస్థికలను జిల్లాలోని ధర్మపురి గోదావరినదిలో కలిపేందుకు కుటుంబసభ్యులందరూ శుక్రవారం ఉదయం మినీ బస్సులో బయలుదేరారు.
బస్సు ఎండపల్లి మండలం కొత్తపేట వద్దకు రాగానే వెల్గ టూర్ నుంచి ధర్మారం వైపు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఒకేకుటుంబానికి చెందిన ఆకుల మంగమ్మ, మౌనిక, శ్రీనివాస్, వెంకటేశం, యాదగిరి, నాగలక్ష్మి, విజయలక్ష్మి, దినేశ్, భాగ్యలక్ష్మి, సుభద్ర, అక్షర, మయాన్షి, మానస, కనకయ్య సహా సుమారు 25 మంది గాయపడ్డారు. 15 మంది కాళ్లు, చేతులు విరిగి తీవ్ర గాయాలపాలయ్యారు. బస్సు క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్ పగిల్ల ఎల్లయ్యను జేసీబీ సాయంతో శ్రమించి బయటకు తీశారు. కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. గాయపడ్డ మిగతావారిని కరీంనగర్, జగిత్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
చెట్టుకొమ్మను తప్పించబోయి..
వెల్గటూర్, ఎండపల్లి మండలాల్లో గురువారం రాత్రి బలమైన ఈదురుగాలలు వీచాయి. వీటిధాటికి చెట్టుకొమ్మలు విరిగి రోడ్డుపై పడ్డాయి. సాయంత్రం వరకూ వాటిని ఎవరూ తొలగించలేదు. అయితే, ఈ చెట్టుకొమ్మలను తప్పించే ప్రయత్నంలో బస్సు డ్రైవర్ అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యమే ఇందకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.