బాప్‌రే.. మనిషి ఎత్తుండే భారీ విస్కీ బాటిల్‌! మంచి పని కోసం వేలానికి..

World Largest Whisky Bottle The Intrepid Goes Auction Soon - Sakshi

రికార్డుల కోసం రకరకాల ప్రయత్నాలు సాగుతుంటాయి. అలాంటిదే ఇది. ప్రపంచంలోనే ఇప్పటి వరకు భారీ విస్కీ బాటిల్‌ను తయారు చేసింది మాకల్లన్‌ కంపెనీ. 32 సంవత్సరాల కింద తయారుచేసిన ఈ బాటిల్‌ సామర్థ్యం 311 లీటర్లు. త్వరలోనే ఈ స్కాచ్‌ విస్కీ బాటిల్‌ వేలానికి రాబోతోంది. 

స్కాట్‌ల్యాండ్‌కు చెందిన మాకల్లన్‌ కంపెనీ ఈ భారీ స్కాచ్‌ విస్కీ బాటిల్‌ను తయారు చేసింది. ది ఇంట్రెపిడ్‌గా గుర్తింపు పొందిన ఈ బాటిల్‌ ఐదు అడుగుల 11 అంగులాల పొడవు ఉంది. అంటే సగటు మనిషి ఎత్తు(5.5 ఫీట్స్‌) కంటే ఎక్కువే!. ఈ కంపెనీ ఇదే పేరుతో తయారు చేసే 444 రెగ్యులర్‌ బాటిల్స్‌ కలిస్తే ఎంతో.. ఈ బాహుబలి విస్కీ బాటిల్‌ అంత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

స్కాట్‌ల్యాండ్‌ రాజధాని ఎడిన్‌బర్గ్‌కు చెందిన ప్రముఖ ఆక్షన్‌ హౌజ్‌.. లైఆన్‌ అండ్‌ టర్న్‌బుల్‌ ఈ వేలంపాటను మే 25వ తేదీన నిర్వహించనుంది. ఇప్పటివరకు ప్రపంచంలో ఒక విస్కీబాటిల్‌ అత్యధికంగా 1.9 మిలియన్‌ డాలర్లు (మన కరెన్సీలో దాదాపు పద్నాలుగున్నర కోట్ల రూపాయల పైమాటే) అమ్ముడుపోయింది. ఈ రికార్డును ది ఇంట్రెపిడ్‌ బద్ధలు కొట్టే అవకాశం కనిపిస్తోంది. 

కిందటి ఏడాది గిన్నిస్‌ బుక్‌లో ఇంట్రెపిడ్‌కు చోటు దక్కింది. ఇప్పుడు వేలం ద్వారా మరో రికార్డుకు సిద్ధం అవుతున్నారు. వేలంపాటలో ప్రారంభ ధరనే 1.3 మిలియన్‌ పౌండ్లుగా అనుకుంటున్నారు. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయం మొత్తంలో.. 25 శాతాన్ని మేరీ క్యూరీ చారిటీకి ఇవ్వాలని భావిస్తున్నారు. నిజానికి ఈ బాటిల్‌ను రికార్డుల కోసం పదిలపర్చాలని సదరు కంపెనీ అనుకుంది. కానీ, ఒక మంచి పనికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు వేలానికి ముందుకు వచ్చింది.

చదవండి: అక్కడేం లేదు.. అయినా నాలుగు కోట్లు!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top