తేల్చిచెప్పిన అంతర్జాతీయ న్యాయస్థానం
ది హేగ్: హక్కుల సాధన కోసం కార్మీకులు తాము పనిచేసే చోట సమ్మె చేయొచ్చని, అందుకు కీలక కార్మీక ఒడంబడిక వీలు కల్పిస్తోందని అంతర్జాతీయ న్యాయస్థానం గురువారం చరిత్రాత్మక నిర్ణయం వెలువర్చింది. ఈ మేరకు కీలక అడ్వైజరీని విడుదలచేసింది. ఐక్యరాజ్యసమితిలో భాగమైన అంతర్జాతీయ కార్మీక సంఘం(ఐఎల్‌ఓ) గతంలో చేసిన ఒక ఒడంబడికలో కార్మీకులకు సమ్మె హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారని, దీని చెల్లుబాటును తేల్చాలంటూ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్(ఐసీజే)ను మూడేళ్ల క్రితం ఐఎల్‌ఓ కోరింది.
ఈ మేరకు తాజాగా ఐసీజే తన నిర్ణయం వెలువర్చింది. ఐసీజే ఇచ్చే అడ్వైజరీలను ప్రపంచదేశాల ప్రభుత్వాలు తు.చ.తప్పకుండా పాటించాలనే నిబంధన లేనప్పటికీ ఐరాస అంతర్గత విభాగమైన ఐసీజే చేసే సూచనలకు అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఉంటుంది. కార్మిక చట్టాలు, ప్రమాణాలు, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలపై ఈ అడ్వైజరీ ప్రభావం చూపనుంది. కార్మీకులకు సమ్మె హక్కులను ప్రసాదిస్తూ ఐఎల్‌ఓ చేసిన తీర్మానాన్ని 158 దేశాలు ఆమోదించాయి. ఐరాస కార్మీక చట్టాలు, నిబంధనావళిని పాటిస్తామని తెలిపాయి.
ఐఎల్‌ఓలో అమెరికా సభ్యదేశంగా కొనసాగుతున్నప్పటికీ ఈ తీర్మానానికి అగ్రరాజ్యం తన సమ్మతి తెలపలేదు. వాతావరణ మార్పుల కట్టడికి ప్రయత్నించని దేశాలను అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిన దేశాలుగా పరిగణించాలని ఐసీజే గత ఏడాది చరిత్రాత్మక అడ్వైజరీని జారీచేయడం తెల్సిందే. కార్మీకులకు సమ్మె చేసే హక్కు ఉందా అంటూ మొదలైన వాదనలపై 18 దేశాల నుంచి వాదోపవాదనలను ది హేగ్‌లోని ఐసీజే కోర్టు గతేడాది అక్టోబర్‌లో ఆలకించింది. ఇందులో మెజారిటీ దేశాలు కార్మీకులకు అనుకూలంగా వాదించడం విశేషం. మెరుగైన జీతభత్యాలు, పనివాతావరణంలో తగు భద్రతా సౌకర్యాల కోసం కార్మీకులు సమ్మెకు దిగొచ్చని ఐసీజే అభిప్రాయపడింది.


