'ఆ చేతులు నరికేస్తాం'.. భారత్‌పై పాక్‌ ప్రేలాపనలు | We'll Cut Off Those Hands: Pak Fresh Threat to India Over Indus Waters | Sakshi
Sakshi News home page

'ఆ చేతులు నరికేస్తాం'.. భారత్‌పై పాక్‌ ప్రేలాపనలు

Jun 30 2026 7:14 AM | Updated on Jun 30 2026 7:22 AM

We'll Cut Off Those Hands: Pak Fresh Threat to India Over Indus Waters

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య సింధు జలాల ఒప్పందం వివాదం మరింత ముదురుతోంది. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ఒప్పందాన్ని అమలులో నిలిపివేసిన భారత్‌పై పాకిస్థాన్‌ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘పాక్‌కు రావాల్సిన నీటిని అడ్డుకునే చేతులను నరికేస్తాం’’ అంటూ ఆ దేశ మంత్రి ఒకరు హెచ్చరికలు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. 

సింధు జలాల ఒప్పందం(Indus Water Treaty)పై పాకిస్థాన్‌ ప్రభుత్వం మరోసారి భారత్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇస్లామాబాద్‌లో ఆ దేశ సమాచార శాఖ మంత్రి అతౌల్లా తరార్‌, పర్యావరణ శాఖ మంత్రి ముసాదిక్‌ మాలిక్‌ సోమవారం సంయుక్త పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో.. భారత్‌ తమ దేశానికి రావాల్సిన నీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

"పొరుగు దేశ ప్రధాని తన చేతిలో ఉన్న కుళాయిని మూసేస్తానంటున్నారు. పాకిస్థాన్‌కు ఒక్క చుక్క నీళ్లు కూడా రానివ్వనని చెబుతున్నారు. మా వాటా నీటిపై ఎవరైనా చేయి వేస్తే.. ఆ చేతులను నరికేస్తాం" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే సింధు జలాల ఒప్పందం ప్రకారం తమకు దక్కాల్సిన నీటి హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని స్పష్టం చేశారు.

ఒప్పందం ఇప్పటికీ అమల్లోనే: పాక్‌
సమాచార శాఖ మంత్రి అతౌల్లా తరార్‌ మాట్లాడుతూ.. 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందం ఇప్పటికీ చట్టబద్ధంగానే అమల్లో ఉందన్నారు. ఒక దేశం ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం, సవరించడం లేదా నిలిపివేయడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం పాకిస్థాన్‌కు నీటిపై ఉన్న హక్కులు కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు. ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా న్యాయ నిపుణులు, జలవనరుల నిపుణులతో ఇస్లామాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు కూడా నిర్వహిస్తున్నట్లు పాకిస్థాన్‌ ప్రకటించింది. భారత్‌ నిర్ణయానికి అంతర్జాతీయ మద్దతు లభించలేదని కూడా పాక్‌ అంటోంది.

పహల్గామ్‌ తర్వాత.. 
1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రవి, బియాస్‌, సట్లెజ్‌ నదులపై భారత్‌కు పూర్తి హక్కులు ఉండగా.. సింధు, జీలం, చెనాబ్‌ నదుల జలాల్లో ఎక్కువ భాగం పాకిస్థాన్‌కు కేటాయించారు. అయితే 2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ దాడికి పాకిస్థాన్‌ మద్దతు ఉన్న ఉగ్రవాదులే కారణమని చెబుతున్న భారత్‌.. సింధు జలాల ఒప్పందాన్ని అమలులో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్‌ విశ్వసనీయంగా, శాశ్వతంగా ముగింపు పలికే వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే భారత్‌వ వాదనను పాకిస్థాన్‌ ఖండించింది.

యుద్ధ హెచ్చరికలు కూడా..
సింధు జలాల వివాదంపై ఇప్పటికే పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ కూడా యుద్ధ హెచ్చరికలు జారీ చేశారు. నీటి భద్రత తమ జాతీయ భద్రతలో భాగమని, దానికి ముప్పు ఏర్పడితే భారత్‌పై యుద్ధానికి కూడా వెనుకాడబోమని వ్యాఖ్యానించారు. తాజా ప్రకటనలతో పాకిస్థాన్‌ మరోసారి అదే వైఖరిని కొనసాగించింది.

భారత్‌ ఏమంటోంది?
అయితే భారత్‌ మాత్రం పాక్‌ ప్రేలాపనలు పట్టించుకోవడం లేదు. తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో భారత ప్రతినిధి అనుపమా సింగ్‌ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంలో భాగంగా ఉపయోగించే దేశం సహకార ఒప్పందాల ప్రయోజనాలు కోరడం తార్కికం కాదన్నారు. 1960లో కుదిరిన ఒప్పందాన్ని ప్రస్తుత పరిస్థితులకు అతీతంగా శాశ్వత హక్కుగా పరిగణించలేమని ఆమె స్పష్టం చేశారు. గత ఆరు దశాబ్దాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, అందుకే సింధు జలాల ఒప్పందాన్ని కూడా ప్రస్తుత వాస్తవాలకు అనుగుణంగా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అలాగే జమ్మూకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని పునరుద్ఘాటించిన భారత్‌, అంతర్జాతీయ వేదికలను ఉపయోగించి పాకిస్థాన్‌ ఉగ్రవాదం, అంతర్గత సమస్యల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది.

మరోసారి మాటల యుద్ధం
పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ఇప్పటికే రెండు దేశాల మధ్య దౌత్య, సైనిక ఉద్రిక్తతలు పెరిగిన వేళ.. ఇప్పుడు సింధు జలాల ఒప్పందం కూడా మరో ప్రధాన వివాదంగా మారింది. ఒకవైపు పాకిస్థాన్‌ యుద్ధ హెచ్చరికలు, మరోవైపు ఉగ్రవాదం కొనసాగినంత కాలం సహకారం ఉండదన్న భారత్‌ వైఖరితో.. రెండు దేశాల మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమవుతోంది. పరిస్థితి ఎలా మారుతుందన్నది ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement