విద్యార్థి వీసాల ప్రక్రియ ప్రారంభం | USA Resumes Student Visas, Social Media Vetting Of Applicants Mandatory | Sakshi
Sakshi News home page

విద్యార్థి వీసాల ప్రక్రియ ప్రారంభం

Jun 20 2025 4:52 AM | Updated on Jun 20 2025 4:52 AM

USA Resumes Student Visas, Social Media Vetting Of Applicants Mandatory

దరఖాస్తుదారుల సోషల్‌ మీడియా ఖాతాల తనిఖీ తప్పనిసరి 

ప్రొఫైళ్లను ‘పబ్లిక్‌’  మోడ్‌లో ఉంచాలని అమెరికా సూచన

వాషింగ్టన్‌: ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు ఆ దేశం శుభవార్త చెప్పింది. కొంతకాలంగా తాత్కాలికంగా నిలిపేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూల ప్రక్రియను పునఃప్రారంభిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. వీసా కోసం అప్లై చేసుకునే విద్యార్థుల సోషల్‌ మీడియా అకౌంట్లను తప్పనిసరిగా తనిఖీ చేస్తామని ప్రకటించింది. దీనికోసం తాజాగా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. 

‘సోషల్‌ మీడియా తనిఖీల ద్వారా మా దేశంలోకి రావాలనుకునే ప్రతి వ్యక్తిని సమగ్రంగా పరిశీలించడానికి వీలవుతుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సోషల్‌ మీడియా ఖాతాలను యూఎస్‌ కాన్సులర్‌ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇందుకోసం దరఖాస్తుదారులు తమ సోషల్‌ మీడియా ప్రొఫైళ్ల ప్రైవసీ సెట్టింగ్స్‌ను ‘పబ్లిక్‌’గా మార్చుకోవాల్సి ఉంటుంది’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికారి ఒకరు తెలిపారు. 

అమెరికా స్టూడెంట్‌ వీసా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను ట్రంప్‌ సర్కార్‌ ఈ ఏడాది మే చివరి వారంలో తాత్కాలికంగా నిలిపేసింది. అమెరికా రావాలనుకునే విద్యార్థుల సోషల్‌ మీడియా అకౌంట్లను పరిశీలించేందుకు సన్నాహాలు చేస్తున్నామని.. అందుకే వీసాల జారీని ఆపేసినట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దరఖాస్తుదారుల సోషల్‌ మీడియా వెట్టింగ్‌ కంపల్సరీ చేస్తూ వీసా అపాయింట్‌మెంట్ల ప్రక్రియను పునఃప్రారంభించింది.

‘సోషల్‌ మీడియా వెట్టింగ్‌’ అంటే?
‘సోషల్‌ మీడియా వెట్టింగ్‌’ అంటే వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు అనుమతి ఇవ్వొచ్చా? లేదా? అనే విషయాన్ని నిర్ణయించడానికి వారి ఆన్‌లైన్‌ కార్యక లాపాలను, ముఖ్యంగా సోషల్‌ మీడియా పోస్టులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం. విద్యార్థి సామాజిక మాధ్యమాల్లోని తన ఖాతాల్లో పాలస్తీనా అనుకూల పోస్టులు, అమెరికా వ్యతిరేక పోస్టులు ఏమైనా ఉన్నాయా? అని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు నిశితంగా పరిశీలిస్తారు. వారివల్ల అమెరికా భద్రతకు ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాతే స్టూడెంట్‌ వీసా మంజూరు చేస్తారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement