అమెరికా ఆర్మీ చీఫ్‌పై వేటు  | Usa Pete Hegseth forces out Army top officer and two other generals | Sakshi
Sakshi News home page

అమెరికా ఆర్మీ చీఫ్‌పై వేటు 

Apr 4 2026 4:56 AM | Updated on Apr 4 2026 6:14 AM

Usa Pete Hegseth forces out Army top officer and two other generals

తక్షణమే రాజీనామా చేయాలని రక్షణ మంత్రి హెగ్సెత్‌ ఆదేశం  

కీలక సైనికాధికారులు డేవిడ్‌ హడ్నీ, విలియమ్‌ గ్రీన్‌ సైతం తొలగింపు  

ఉద్వాసనకు కారణాలు వెల్లడించని పెంటగాన్‌

వాషింగ్టన్‌:  పశ్చిమాసియాలో భీకర యుద్ధం జరుగుతున్న తరుణంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అమెరికా 41వ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఆఫ్‌ ద ఆర్మీ జనరల్‌ ర్యాండీ జార్జితోపాటు మరో ఇద్దరు సైనికాధికారులపై వేటు పడింది. తక్షణమే రాజీనామా చేయాలంటూ అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ వారిని ఆదేశించినట్లు పెంటగాన్‌ గురువారం వెల్లడించింది. అయితే, ఈ ఉద్వాసనకు కారణం ఏమిటన్నది బయటపెట్టలేదు. ర్యాండీ జార్జి జో బైడెన్‌ హయాంలో ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. 2023 ఆగస్టు నుంచి పదవిలో కొనసాగుతున్నారు. 

కనీసం నాలుగేళ్లపాటు సైన్యాధిపతిగా పనిచేయాల్సి ఉండగా, ట్రంప్‌ ప్రభుత్వ ఆదేశాలతో మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచి్చన తర్వాత పది మందికిపైగా అత్యున్నత సైనిక జనరల్స్, అడ్మిరల్స్‌ను తొలగించారు. అదే కోవలో ర్యాండీ జార్జిని సైతం పక్కనపెట్టినట్లు పెంటగాన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు ఇరాన్‌పై భీకర యుద్ధం జరుగుతుండగానే మరోవైపు ఆర్మీ చీఫ్‌ను హఠాత్తుగా తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఆర్మీ ట్రాన్స్‌ఫర్మేషన్, ట్రైనింగ్‌ కమాండ్‌ చీఫ్‌ జనరల్‌ డేవిడ్‌ హడ్నీ, చీఫ్‌ ఆఫ్‌ కంప్లెయింట్స్‌ మేజర్‌ జనరల్‌ విలియమ్‌ గ్రీన్‌పైనా హెగ్సెత్‌ వేటు వేశారు.  

క్షేత్రస్థాయి యుద్ధాల్లో అనుభవం  
జనరల్‌ ర్యాండీ జార్జికి అనేక యుద్ధాల్లో క్షేత్రస్థాయిలో పాల్గొన్న అనుభవం ఉంది. వెస్ట్‌ పాయింట్‌ మిలటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. మొదటి గల్ఫ్‌ యుద్ధంతోపాటు ఇరాక్, అఫ్గానిస్తాన్‌ యుద్ధాల్లో ఇన్‌ఫాంట్రీ ఆఫీసర్‌గా సేవలందించారు. 2021, 2022లో అప్పటి రక్షణ మంత్రి లాయిడ్‌ అస్టిన్‌ వద్ద సైనిక సహాయకుడిగా పనిచేశారు. నిజానికి 2025 ఫిబ్రవరిలోనే సైనికాధికారుల తొలగింపు మొదలైంది. తొలి విడతలో పలువురు కీలక అధికారులకు ఇంటిదారి పట్టారు. అప్పట్లో వేటు నుంచి తప్పించుకున్న ర్యాండీ జార్జి ఏడాది తర్వాత ఉద్వాసనకు గురికాక తప్పలేదు. హెగ్సెత్‌ ఆదేశాల మేరకు ఆయన రాజీనామా సమర్పించినట్లు తెలిసింది. ర్యాండీ జార్జి అందించిన సేవలను కొనియాడుతూ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.    

ఇరాన్‌లో కాదు.. అమెరికాలోనే ఆ మార్పు  
ఇరాన్‌లో పాలకులను మార్చేస్తానంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ యుద్ధం ఆరంభించారు. ట్రంప్‌ ఆశిస్తున్న ఆ మార్పు ఇరాన్‌లో కాకుండా అమెరికాలోనే జరుగుతోంది. ఫిబ్రవరి 28న ఇరాన్‌లో దాడులు ప్రారంభం కాగా, ఆ తర్వాత అమెరికాలో చాలామంది కీలక నేతలు, అధికారులు పదవుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వీరిలో ట్రంప్‌ సన్నిహితులు కూడా ఉన్నారు. తాజాగా క్రిస్టీ నోయెమ్, పామ్‌ బాండీపై ట్రంప్‌ వేటేశారు. కీలక సైనికాధికారులు కూడా తొలగింపునకు గురయ్యారు. త్వరలోనే మరికొందరిని ఇంటికి పంపబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇరాన్‌ యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు లేకపోవడం ట్రంప్‌ను కలవరపరుస్తోంది. ఆయన పట్ల జనాదరణ తగ్గుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.  

నూతన సైన్యాధిపతిగా క్రిస్టోఫర్‌ లానీవ్‌  
జనరల్‌ ర్యాండీ జార్జి స్థానంలో తాత్కాలిక సైన్యాధిపతిగా జనరల్‌ క్రిస్టోఫర్‌ లానీవ్‌ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు పెంటగాన్‌ వర్గాలు తెలియజేశాయి. గత ఏడాది అక్టోబర్‌లో క్రిస్టోఫర్‌ను ఆర్మీ వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా అధ్యక్షుడు ట్రంప్‌ నామినేట్‌ చేశారు. ఆ సమయంలో హెగ్సెత్‌కు క్రిస్టోఫర్‌ అగ్రశ్రేణి సైనిక సహాయకుడిగా పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు కేవలం టూ–స్టార్‌ జనరల్‌ హోదా కలిగిన క్రిస్టోఫర్‌ ఇప్పుడు సైన్యాధిపతిగా పదోన్నతి పొందడం విశేషం. ఇరాన్‌లో భూతల దాడులకు అమెరికా సైన్యం సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. వేలాది మెరైన్లతోపాటు 82వ ఎయిర్‌బార్న్‌ డివిజన్‌ ట్రూపర్లు పశ్చిమాసియా దిశగా కదులుతున్నారు.

అటార్నీ జనరల్‌ పామ్‌ బాండీకి ఉద్వాసన 
అమెరికా అటార్నీ జనరల్‌ పామ్‌ బాండీని అధ్యక్షుడు ట్రంప్‌ పదవి నుంచి తొలగించారు. తన పాలనను గట్టిగా సమరి్థంచే దీర్ఘకాల స్నేహితురాలిపై అకస్మాత్తుగా వేటు వేశారు. బాండీ పనితీరు పట్ల ట్రంప్‌ కొన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎఫ్‌స్టీన్‌ ఫైల్స్‌ ఉదంతంలో తనపై దర్యాప్తు విషయంలో ఆమె సరిగ్గా వ్యవహరించలేదని ట్రంప్‌ భావిస్తున్నారు. బాండీ స్థానంలో టాడ్‌ బ్రాంచ్‌ను ఏజీగా నియమించారు. తన ఉద్వాసనపై బాండీ స్పందించారు. ‘‘ఏజీ పదవి లభించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ట్రంప్‌కు, ఆయన ప్రభుత్వానికి సేవలు అందిస్తూనే ఉంటా’’ అని తెలిపారు. గత నెలలో హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ చీఫ్‌ క్రిస్టీ నోయెమ్‌నూ ట్రంప్‌ తొలగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement