భారత్‌తో చర్చలు.. అమెరికా కీలక వ్యాఖ్యలు

US Says Want To Ensure India China Border Standoff Does Not Escalate - Sakshi

త్వరలోనే 2+2 చర్చలు

భారత్‌ ప్రకటన పట్ల సంతోషంగా ఉంది: అమెరికా

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: తూర్పు లదాఖ్‌ సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన పరిస్థితులను గమనిస్తున్నామని, దక్షిణ చైనా సముద్రం సహా ఇండో పసిఫిక్‌ జలాల్లో దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తున్న చైనాకు దీటుగా బదులిచ్చేందుకు భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అగ్రరాజ్యం అమెరికా పునరుద్ఘాటించింది. ఆగ్నేయాసియాలో కీలక దేశమైన భారత్‌కు ఎల్లప్పుడు తన మద్దతు ఉంటుందని పేర్కొంది. 2016 నుంచి ఇండియా తమ మేజర్‌ డిఫెన్స్‌ పార్టనర్‌గా మారిందని, గత నాలుగేళ్లుగా ఇరుదేశాల మధ్య రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాల విషయంలో ఇటీవల కీలక ముందడుగు పడిందని పేర్కొంది. కాగా సైన్య సహకారం, పరస్పర సమాచార మార్పిడి తదితర అంశాలకు సంబంధించిన ఒప్పందాల గురించి భారత్‌- అమెరికాల మధ్య వచ్చే వారం 2+2 చర్చలు జరుగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బేసిక్‌ ఎక్స్స్ఛేంజ్‌ అండ్‌ కో-ఆపరేషన్‌ అగ్రిమెంట్‌(బీఈసీఏ)పై భారత్‌ సంతకం చేయనుంది. (చదవండి: చైనా పన్నాగం; ఆ తర్వాతే బలగాల ఉపసంహరణ!)

శత్రు దేశాలకు దీటుగా బదులిచ్చే క్రమంలో వారి స్థావరాలను గుర్తించి, దాడి చేసేందుకు ఉద్దేశించిన ఎంక్యూ- 9బి వంటి ఆర్మ్‌డ్‌ డ్రోన్స్‌ దిగుమతి తదితర అంశాల గురించి ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదరనుంది. చర్చలు విజయవంతమైన తరుణంలో యూఎస్‌ గ్లోబల్‌ జియో- స్పేషియల్‌ మ్యాపులు ఉపయోగించి క్రూయిజ్‌ మిసైల్స్‌, బాలిస్టిక్‌ క్షిపణుల కచ్చితమైన జాడను తెలుసుకునే వీలు కలుగుతుంది. దీంతో దొంగ దెబ్బ తీయాలనుకునే శత్రు దేశాల వ్యూహాలను చిత్తు చేసి వారికి దీటుగా బదులిచ్చే అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ పాలనా యంత్రాంగంలోని సీనియర్‌ అధికారులు శనివారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

‘‘హిమాలయాల నుంచి దక్షిణ చైనా సముద్రం నుంచి వరకు ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దుందుడుకు చర్యలకు బదులిచ్చే క్రమంలో సారూప్య భావజాలం, ఒకే విధమైన ఆలోచనా విధానం కలిగిన ఇండియా వంటి భాగస్వామితో కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. మలబార్‌ నావికాదళ విన్యాసాల్లో ఆస్ట్రేలియాతో జట్టుకట్టనున్నట్లు ఇటీవల భారత్‌ చేసిన ప్రకటన పట్ల మాకెంతో సంతోషంగా ఉంది. భారత్‌కు మా మద్దతు ఉంటుంది. సైన్య సహకారం, పరస్పర సమాచార మార్పిడితో ముందుకు సాగుతాం.

త్వరలోనే జరుగనున్న చర్చల్లో భాగంగా,  ఆగ్నేయాసియా ప్రాంతంలో పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలు, దక్షిణ చైనా సముద్రం తదితర అంశాల్లో భారత్‌ భాగస్వామ్యం మరింతగా పెరగడాన్ని స్వాగతిస్తున్నాం. తూర్పు లదాఖ్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది’’ అని పేర్కొన్నారు. కాగా కాగా పరస్పర సైన్య సహకారం, ఇండో- పసిఫిక్‌ జలాల్లో నిర్మాణాలు చేపట్టకుండా, అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఓ కన్నేసి ఉంచి, పరస్పరం సహకరించుకునే క్రమంలో సమాచార మార్పిడి తదితర అంశాల్లో భారత్‌- అమెరికా ఇప్పటికే మూడు ప్రాథమిక ఒప్పందాలు కుదిరిన విషయం తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top