ట్రంప్‌కు టారిఫ్‌లు విధించే అధికారాల్లేవ్‌.. కోర్టు సంచలన వ్యాఖ్యలు | US Court Blocks Donlad Trump Tariffs And Rejects India-Pakistan Conflict Argument | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు టారిఫ్‌లు విధించే అధికారాల్లేవ్‌.. కోర్టు సంచలన వ్యాఖ్యలు

May 29 2025 8:55 AM | Updated on May 29 2025 10:26 AM

US Court Blocks Donlad Trump Tariffs

వాషింగ్టన్‌: అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌కు యూఎస్‌ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ‘లిబరేషన్ డే’ సందర్భంగా పలు దేశాలపై ట్రంప్‌ విధించిన టారిఫ్‌ల విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యవసర పరిస్థితిలో మాత్రమే అధ్యక్షుడికి ఆర్థిక ఆంక్షలు విధించే అధికారం ఉంటుందని మాన్‌హట్టన్‌ కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో, ట్రంప్‌ ప్రభుత్వానికి చుక్కెదురైంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ టారిఫ్‌లు (Trump Tariffs) అమలుకాకుండా యూఎస్‌ ట్రేడ్‌ కోర్టు నిలుపుదల చేసింది. ఈ క్రమంలో మాన్‌హట్టన్‌ కోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల బృందం తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే అధికారం కేవలం కాంగ్రెస్‌కే ఉంది. విశేష అధికారాలతో టారిఫ్‌లు విధించడం సరికాదు. ఇది రాజ్యాంగ వ్యవస్థలను బలహీన పరచడమే అవుతుంది అని చెప్పుకొచ్చింది.

అయితే, ట్రంప్ ఈ చర్యను అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద తీసుకున్నట్టు అమెరికన్ కమాండర్ ఇన్ చీఫ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని ఆర్థిక ఒత్తిడి సాధనంగా వినియోగించేందుకు వీలు లేదని కోర్టు తేల్చింది.  ఇదే సమయంలో ‘భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల (India-Pakistan Tensions)’ అంశాన్ని ట్రంప్‌ సర్కారు ప్రస్తావించగా.. కోర్టు దాన్ని తోసిపుచ్చింది.

అధ్యక్షుడికి ఉన్న టారిఫ్‌ అధికారాలను సమర్థించాలని ట్రంప్‌ (Donald Trump) అడ్మినిస్ట్రేషన్‌ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. చట్టపరంగా ఎదురైన ఈ సవాల్‌.. చైనాతో వాణిజ్య సంధిని మార్చేస్తుందని, భారత్‌-పాక్‌ మధ్య ఘర్షణలను పెంచుతుందని అధికారులు వాదించారు. ‘‘టారిఫ్‌ అధికారం వల్లనే ఇటీవల భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్‌ సాధించగలిగారు’’ అని కోర్టుకు తెలిపారు. సుంకాలకు సంబంధించి ప్రస్తుతం అనేక దేశాలతో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్‌ సర్కారు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఈ ట్రేడ్‌ డీల్స్‌ను ఖరారు చేసుకునేందుకు జులై 7 వరకు గడువు ఉందని, అప్పటివరకు దీన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని కోర్టును కోరింది. అయితే ట్రంప్‌ అడ్మిస్ట్రేషన్‌ చేసిన అన్ని వాదనలను కోర్టు తిరస్కరించింది.

ఇక, ఈ టారిఫ్‌లపై అమెరికాలోని ఐదు చిన్న దిగుమతి వ్యాపార సంస్థలు, ఒరెగాన్ రాష్ట్ర అటార్నీ జనరల్ డాన్ రేఫీల్డ్ నాయకత్వంలో ఉన్న 13 రాష్ట్రాల కూటమి వ్యాజ్యం దాఖలు చేశాయి. ఈ టారిఫ్‌లు చట్టవిరుద్ధం, నిర్లక్ష్యంగా తీసుకున్నవని, ఆర్థికంగా నష్టం కలిగించేవి అంటూ వారు పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement