పుతిన్‌ గెలవడం కల్ల రష్యాపై మరిన్ని ఆంక్షలు తప్పవు

Ukraine Will Never Be A Victory For Russia says Joe Biden - Sakshi

బైడెన్‌

వార్సా:  ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న పచ్చిమ దేశాల సంకల్పాన్ని ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కఠినతరంగా మార్చిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. కఠినమైన, అప్రియమైన రోజులు ముందు ముందు ఉండబోతున్నాయని, అందుకు సిద్ధంగా ఉండాలని ఉక్రెయిన్‌కు సూచించారు. తాము, తమ మిత్రదేశాలు ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తాయని వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా ఎప్పటికీ విజయం సాధించలేదని తేల్చిచెప్పారు.

రష్యాపై దాడిచేసేందుకు పచ్చిమ దేశాలు కుట్ర పన్నుతున్నాయంటూ పుతిన్‌ చేసిన ఆరోపణలను బైడెన్‌ ఖండించారు. అలాంటి ఉద్దేశం తమకు లేదని పేర్కొన్నారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలు నేడు, రేపు, ఎప్పటికీ రక్షణ కవచంగా నిలుస్తాయని ఉద్ఘాటించారు. జో బైడెన్‌ ఉక్రెయిన్‌ పర్యటన ముగించుకొని మంగళవారం పోలాండ్‌కు చేరుకున్నారు. పోలాండ్‌ అధ్యక్షుడు అండ్రెజ్‌ డుడాతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధంతోపాటు పలు కీలక అంశాలపై చర్చించారు.

నాటోకు అమెరికా ఎంత అవసరమో అమెరికాకు నాటో, పోలాండ్‌ కూడా అంతే అవసరమని డుడాతో బైడెన్‌ అన్నారు. అనంతరం రాజధాని వార్సాలోని రాజభవనంలో ఉక్రెయిన్‌ శరణార్థులను, స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రష్యా దండయాత్రను తట్టుకొని ఉక్రెయిన్‌ బలంగా ఎదురు నిలుస్తోందని ప్రశంసించారు. ఉక్రెయిన్‌ వైఖరి గర్వకారణమన్నారు. ‘నాటో’ కూటమి గతంలో ఎన్నడూ లేనంగా బలంగా ఇప్పుడు ఉందని పేర్కొన్నారు. నాటోలోని ఏ ఒక్క దేశంపై అయిన ఎవరైనా దాడి చేస్తే అది మొత్తం నాటోపై దాడి చేసినట్లేనని హెచ్చరించారు.

అయితే న్యూ స్టార్ట్‌ ఒప్పందంలో తమ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుంటున్నామన్న పుతిన్‌ ప్రకటనపై బైడెన్‌ స్పందించలేదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తున్నారంటూ పోలాండ్, ఉక్రెయిన్‌ సైన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘పుతిన్‌ తనను తాను కఠినమైన వ్యక్తినని అనుకుంటున్నారు. కానీ అమెరికా ఉక్కు సంకల్పంతో పేచీ పెట్టుకుంటున్నారు. చేసిన తప్పులకు రష్యా మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అన్నారు. మిత్రదేశాలతో కలిసి రష్యాపై ఈ వారంలోనే మరిన్ని ఆంక్షలు విధించబోతున్నట్లు వెల్లడించారు.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top