Uk Prime Minster Liz Truss Resigns Amid Political Crisis, Details Inside - Sakshi
Sakshi News home page

బ్రిటన్ చరిత్రలో తొలిసారి.. 45 రోజుల్లోనే ప్రధాని రాజీనామా

Published Thu, Oct 20 2022 6:17 PM

Uk Prime Minster Liz Truss Resigns - Sakshi

లండన్‌: సొంత పార్టీ సభ్యుల నుంచే అసమ్మతి సెగ ఎదుర్కొంటున్న యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) ప్రధానమంత్రి లిజ్‌ ట్రస్‌(47) గురువారం పదవికి రాజీనామా చేశారు. ఆర్థికంగా పెను సవాళ్లు ఎదురవ్వడం, మినీ బడ్జెట్‌తో పరిస్థితి మరింత దిగజారడం, రష్యా నుంచి గ్యాస్‌ సరఫరా నిలిచిపోవడంతో ఖజానాపై విద్యుత్‌ బిల్లుల భారం పెరిగిపోవడం, ధనవంతులకు పన్ను మినహాయింపుల పట్ల ఆరోపణలు రావడం, డాలర్‌తో పోలిస్తే పౌండు విలువ దారుణంగా పడిపోవడం, వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినడం వంటి అంశాలు ఆమెపై విపరీతమైన ఒత్తిడిని పెంచాయి.

మరోవైపు సొంత పార్టీ ఎంపీలు తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధపడడంతో రాజీనామాకే ట్రస్‌ మొగ్గుచూపారు. కన్జర్వేటివ్‌ నాయకురాలి పదవి నుంచి తప్పుకున్నారు. అనూహ్య రీతిలో కేవలం 45 రోజుల్లో తన భర్తతో కలిసి ‘10 డౌనింగ్‌ స్ట్రీట్‌’ నుంచి భారంగా నిష్క్రమించారు. పార్టీ నాయకత్వం తనకు కట్టబెట్టిన బాధ్యతను నెరవేర్చలేకపోయాయని, ఆర్థిక అజెండాను అమలు చేయలేకపోయానని, అందుకే పదవికి రాజీనామా చేశానని చెప్పారు. కొత్త ప్రధానమంత్రి ఎన్నికయ్యే దాకా ప్రధానిగా ట్రస్‌ కొనసాగుతారు. నూతన ప్రధాని ఎవరన్నది వారం రోజుల్లోగా తేలిపోనుంది.  

పార్టీ, ప్రజల విశ్వాసం పొందలేక  
లిజ్‌ ట్రస్‌ గత నెల 6వ తేదీన యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మార్గరెట్‌ థాచర్, థెరెసా మే తర్వాత మూడో మహిళా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. కానీ, సొంత పార్టీ ఎంపీలతోపాటు యూకే ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయారు. కేవలం 45 రోజులపాటు అధికారంలో కొనసాగారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ చరిత్రలో అతితక్కువ కాలం అధికారంలో ఉన్న ప్రధానమంత్రిగా మరో రికార్డును లిజ్‌ ట్రస్‌ నెలకొల్పారు.  

తెరపైకి పలువురి పేర్లు  
లిజ్‌ ట్రస్‌ తాజా మాజీ ప్రత్యర్థి, భారత సంతతికి చెందిన అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీ రిషి సునాక్‌ తదుపరి ప్రధానమంత్రి రేసులో ముందంజలో ఉన్నారు. ఆయనను కొత్త ప్రధానమంత్రిగా ఎన్నుకొనే విషయంలో కన్జర్వేటివ్‌ పార్టీ అంతరంగం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. పార్టీలోని కొందరు సభ్యులు ఆయన పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే పార్టీలో ఏకాభిప్రాయం లేదని స్పష్టంగా చెప్పొచ్చు. మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పేరు తెరపైకి వస్తుండడం గమనార్హం. జాన్సన్‌ను మళ్లీ ప్రధానిని చేయాల్సిందేనని ఆయన మద్దతుదారులు గొంతు విప్పుతున్నారు.

అలాగే గతంలో ఈ పదవికి పోటీ పడిన పెన్నీ మోర్డాంట్, భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్, రక్షణ శాఖ మంత్రి బెన్‌ వాలెస్‌ పేర్లు  గట్టిగా వినిపిస్తున్నాయి. సుయెల్లా బ్రేవర్మన్‌ దేశ హోం శాఖ మంత్రి పదవికి బుధవారమే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దేశంలో అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి, తక్షణమే సాధారణ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష లేబర్‌ పార్టీ డిమాండ్‌ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. అనిశ్చితికి తెరపడాలంటే ఎన్నికలు నిర్వహించడం ఒక్కటే మార్గమని లేబర్‌ పార్టీ నేత సర్‌ కీర్‌ స్టార్మర్‌ చెప్పారు. అధికార కన్జర్వేటివ్‌ పార్టీ గత 12 ఏళ్లుగా వైఫల్యాల బాటలో కొనసాగుతోందని అన్నారు. అవన్నీ ఇప్పుడు తారస్థాయికి చేరాయని ఆక్షేపించారు.  

జీవించి ఉన్న ఏడుగురు మాజీలు
ఆధునిక చరిత్రలో యూకేలో ఏడుగురు మాజీ ప్రధానమంత్రులు జీవించి ఉండడం ఇదే మొదటిసారి. ఒకరకంగా చెప్పాలంటే మాజీ ప్రధానుల జాబితా పెరుగుతోంది. బోరిస్‌ జాన్సన్, థెరెసా మే, డేవిడ్‌ కామెరూన్, గోర్డాన్‌ బ్రౌన్, సర్‌ టోనీ బ్లెయిర్, సర్‌ జాన్‌ మేయర్‌ సరసన ఇప్పుడు ట్రస్‌ చేరారు.  

45 రోజుల ప్రధానమంత్రి  
యూకేలో పలువురు ప్రధానమంత్రులు ఏడాది కంటే తక్కువ కాలమే అధికారంలో కొనసాగారు. పదవిలో ఉండగానే మరణించడం లేదా రాజీనామా వంటివి ఇందుకు కారణాలు. తాజాగా 45 రోజుల ప్రధానిగా ట్రస్‌ రికార్డు సృష్టించారు.

బాధ్యత నెరవేర్చలేకపోయా
దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానన్న నమ్మకంతో తనను ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని, ఆ బాధ్యతను నెరవేర్చడంలో విఫలమయ్యానని లిజ్‌ ట్రస్‌ పేర్కొన్నారు. అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు. గురువారం రాజీనామా అనంతరం ఆమె లండన్‌లోని డౌనింగ్‌ స్ట్రీట్‌లో మీడియాతో మాట్లాడారు. రాజీనామాకు దారితీసిన కారణాలను వెల్లడించారు. అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నాయకురాలి పదవికి రాజీనామా చేశానంటూ రాజు చార్లెస్‌కు తెలియజేశానని అన్నారు.

అస్థిరమైన ఆర్థిక వ్యవస్థ, ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితుల నడుమ యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) ప్రధానమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టానని గుర్తుచేశారు. లిజ్‌ ట్రస్‌ ఇంకా ఏం చెప్పారంటే.. ‘‘బిల్లులు చెల్లించలేక ప్రజలు, వ్యాపారవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఆదాయాలు లేకపోవడంతో బిల్లులు ఎలా కట్టాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రారంభించిన చట్టవిరుద్ధమైన యుద్ధం మన భద్రతకు ముప్పుగా మారింది.

ఆర్థిక వృద్ధి క్రమంగా పడిపోతోంది. మన దేశం వెనుకంజ వేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి, దేశాన్ని ముందుకు నడిపిస్తానన్న విశ్వాసంతో కన్జర్వేటివ్‌ పార్టీ నన్ను ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. ఇంధన బిల్లులు, జాతీయ ఇన్సూరెన్స్‌లో కోత వంటి అంశాల్లో కార్యాచరణ ప్రారంభించాం. తక్కువ పన్నులు, ఎక్కువ ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. బ్రెగ్జిట్‌ వల్ల లభించిన స్వేచ్ఛను వాడుకోవాలన్నదే మన ఉద్దేశం. కానీ, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకున్నా. పార్టీ నాకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడంలో విఫలమయ్యానని గుర్తించా.

రాజు చార్లెస్‌తో మాట్లాడా. కన్జర్వేటివ్‌ పార్టీ నేత పదవికి రాజీనామా చేశానని తెలియజేశా. ఈ రోజు ఉదయమే ‘1922 కమిటీ’ చైర్మన్‌ సర్‌ గ్రాహం బ్రాడీతో సమావేశమయ్యా. వారం రోజుల్లోగా నూతన నాయకుడి (ప్రధానమంత్రి) ఎన్నిక ప్రక్రియను పూర్తిచేయాలని మేము ఒక నిర్ణయానికొచ్చాం. మనం అనుకున్న ప్రణాళికలను సక్రమంగా అమలు చేయడానికి, మన దేశ ఆర్థిక రంగంలో స్థిరత్వాన్ని సాధించడానికి, దేశంలో భద్రత కొనసాగించడానికి నూతన ప్రధానమంత్రి ఎన్నిక దోహదపడుతుందని భావిస్తున్నా. నా వారసుడు(కొత్త ప్రధాని) ఎన్నికయ్యే దాకా పదవిలో కొనసాగుతా’’.

చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్‌ కెమెరా ఇదే.. మెగాపిక్సెల్ ఎంతంటే?

Advertisement
 
Advertisement
 
Advertisement