వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు సిద్ధమయ్యారు. అత్యంత ఆసక్తి రేపుతున్న ఈ పర్యటన మే 13 నుంచి 15 వరకు జరగనుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు బీజింగ్ వెళ్తున్న ట్రంప్.. పశ్చిమాసియా సంక్షోభం, వాణిజ్య సంబంధాలతో పాటు పలు కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరపనున్నారు.
ఇరాన్, రష్యా కేంద్రంగా వ్యూహాలు
ఈ చారిత్రక భేటీలో ప్రధానంగా ఇరాన్, రష్యా అంశాలు కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఆ రెండు దేశాలకు చైనా అందిస్తున్న ఆర్థిక సహకారం, విడిభాగాలు, ఆయుధ ఎగుమతుల సామర్థ్యంపై ఉభయ దేశాల అధినేతలు ఇప్పటికే పలుమార్లు చర్చించినట్లు అమెరికా ఉన్నతాధికారులు తెలిపారు. ఈ పర్యటనలో అమెరికా-చైనా బోర్డ్ ఆఫ్ ట్రేడ్, బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రతిపాదనల్లో పురోగతిపై చర్చలు జరగనున్నాయి. ఏరోస్పేస్, వ్యవసాయం, ఇంధన రంగాలకు సంబంధించిన కీలక ఒప్పందాలకు ప్రాధాన్యత దక్కనుంది. వాణిజ్యంలో ఉమ్మడి ప్రాధాన్యతలను గుర్తించడమే లక్ష్యంగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఈ పర్యటన అనంతరం ఈ ఏడాది చివర్లో షీ జిన్‌పింగ్ దంపతులకు వాషింగ్టన్ డీసీలో ట్రంప్ ఆతిథ్యం ఇవ్వనున్నారు.
తైవాన్, ఇరాన్ ఆంక్షల వేళ ఉత్కంఠ
ఈ అగ్ర దేశాల చర్చల్లో తైవాన్ అంశం ప్రస్తావనకు రానున్నప్పటికీ, అమెరికా విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు, ఇరాన్ ఇంధన, ఆర్థిక రంగాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా ఇటీవల విధించిన తాజా ఆంక్షలు టెహ్రాన్, చైనా వాణిజ్య నెట్‌వర్క్‌లపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. ‘ఎకనామిక్ ఫ్యూరీ’ పేరుతో ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ప్రకటించిన ఈ కఠిన ఆంక్షల నడుమ ట్రంప్ పర్యటన అత్యంత ఉత్కంఠ రేపుతోంది.
ఇది కూడా చదవండి: ‘యూపీఐ పేమెంట్’తో సువేందు పీఏ హంతకుల పట్టివేత


