‘యూపీఐ పేమెంట్‌’తో సువేందు పీఏ హంతకుల పట్టివేత | One UPI Payment Traps Suvendu Adhikaris PA Killers | Sakshi
Sakshi News home page

‘యూపీఐ పేమెంట్‌’తో సువేందు పీఏ హంతకుల పట్టివేత

May 11 2026 11:12 AM | Updated on May 11 2026 12:18 PM

One UPI Payment Traps Suvendu Adhikaris PA Killers

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ దారుణ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అనూహ్యమైన పురోగతి సాధించారు. నిందితులు చేసిన ఒకే ఒక్క చిన్న పొరపాటు వారిని పోలీసులకు చిక్కేలా చేసింది. టోల్ ప్లాజా వద్ద చేసిన ఆన్లైన్ పేమెంట్ ఆధారంగా, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు అనుమానితులను బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టోల్ ప్లాజా వద్ద పట్టించిన ‘యూపీఐ’
హత్య అనంతరం పరారైన దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులకు టోల్ ప్లాజా వద్ద ఓ ‘యూపీఐ’ ద్వారా జరిగిన ఆన్‌లైన్ పేమెంట్ దర్యాప్తులో కీలకంగా మారింది. దీని ఆధారంగా నిందితుల కదలికలను పసిగట్టిన పోలీసులు బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు బిహార్‌లోని బక్సర్‌కు చెందినవారు కాగా, మరొకరు యూపీలోని బల్లియాకు చెందిన వ్యక్తి. సోమవారం రాత్రి వీరందరినీ పశ్చిమ బెంగాల్‌కు తరలించిన పోలీసులు ముమ్మర విచారణ చేపట్టారు.

సినిమాను తలపించేలా ఛేజింగ్, కాల్పులు
మే 6వ తేదీ రాత్రి కోల్‌కతా శివార్లలోని నార్త్ 24 పరగణాల జిల్లా దొహారియా ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. కారులో ముందు సీటులో ప్రయాణిస్తున్న చంద్రనాథ్‌ను బైక్‌లపై వెంబడించిన దుండగులు అడ్డగించారు. అనంతరం కారు అద్దం గుండా అత్యంత సమీపం నుంచి (పాయింట్ బ్లాంక్ రేంజ్) కాల్పులు జరిపి, క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ భయానక దాడిలో చంద్రనాథ్ రథ్ ప్రాణాలు కోల్పోగా, బుల్లెట్ గాయాలపాలైన కారు డ్రైవర్ కోల్‌కతా ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.

కుట్ర వెనుక మాస్టర్ మైండ్ ఎవరు?
అత్యంత ప్రణాళికాబద్ధంగా జరిగిన ఈ హత్యలో పట్టుబడిన నిందితుల పాత్ర ఏమిటనే దానిపై పోలీసులు  ఆరా తీస్తున్నారు. ఎన్నికల అనంతర హింసను ప్రేరేపించే కుట్రలో భాగంగానే ఈ హత్య జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. ఈ ఘాతుకానికి గల ప్రధాన కారణాలు, దీని వెనుక ఉన్న అసలు కుట్రదారుల వివరాలతో బెంగాల్ పోలీసులు త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: థాయ్‌లాండ్ పాలిటిక్స్‌: జైలు నుంచి ‘కింగ్ మేకర్’ విడుదల

Advertisement
 
Advertisement
Advertisement