థాయ్‌లాండ్ పాలిటిక్స్‌: జైలు నుంచి ‘కింగ్ మేకర్’ విడుదల | Thai Ex PM Thaksin Shinawatra Freed Early on Parole | Sakshi
Sakshi News home page

థాయ్‌లాండ్ పాలిటిక్స్‌: జైలు నుంచి ‘కింగ్ మేకర్’ విడుదల

May 11 2026 9:44 AM | Updated on May 11 2026 10:43 AM

Thai Ex PM Thaksin Shinawatra Freed Early on Parole

బ్యాంకాక్: థాయ్‌లాండ్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దేశ మాజీ ప్రధాని, 76 ఏళ్ల టెలికాం బిలియనీర్ థాక్సిన్ షినవత్రా సోమవారం బ్యాంకాక్ జైలు నుంచి ముందస్తుగా విడుదలయ్యారు. అవినీతి కేసులో శిక్ష అనుభవిస్తున్న ఈ రాజకీయ దిగ్గజం మళ్లీ తెరపైకి రావడం థాయ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.

షరతులతో కూడిన స్వేచ్ఛ
అవినీతి ఆరోపణలపై గత సెప్టెంబర్ నుంచి ఏడాది జైలు శిక్ష అనుభవిస్తున్న థాక్సిన్‌ వయసును పరిగణనలోకి తీసుకుని ముందస్తుగా విడుదల మంజూరు చేశారు. అయితే నాలుగు నెలల ప్రొబేషన్ పీరియడ్‌లో ఆయన తప్పనిసరిగా కాలికి ఎలక్ట్రానిక్ మానిటర్ ధరించాల్సి ఉంటుంది. జైలు వెలుపల తన కుటుంబ సభ్యులను కౌగిలించుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తమ అభిమాన నేత రాకతో అక్కడికి చేరుకున్న వందలాది ‘రెడ్ షర్ట్’ మద్దతుదారులు థాక్సిన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు.

వివాదాలు.. తగ్గని మద్దతు
2023 ఆగస్టులో ప్రవాసం నుంచి తిరిగి వచ్చిన థాక్సిన్‌కు మొదట ఎనిమిదేళ్ల శిక్ష పడినా, రాజ క్షమాభిక్షతో అది ఏడాదికి తగ్గింది. అయితే జైలుకు బదులుగా ఆసుపత్రిలో గడపడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన కుటుంబానికి చెందిన ‘ఫ్యూ థాయ్’ పార్టీ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఫిబ్రవరి ఎన్నికల్లో పార్టీ మూడో స్థానానికి పడిపోయినప్పటికీ, ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం థాక్సిన్ పునరాగమనానికి మార్గం సుగమం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా?
థాక్సిన్ విడుదల ఆయన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆయన కొంతకాలం దూరంగా ఉన్నా, రాజకీయాలను విడిచిపెట్టరని మద్దతుదారులు బలంగా నమ్ముతున్నారు. మరోవైపు సంప్రదాయవాదులు, థాక్సిన్ వ్యతిరేకులు ఆయన తదుపరి అడుగులపై నిశితంగా దృష్టి పెట్టారు. అయితే ఆయన కూతురు, మాజీ ప్రధాని పీటాంగ్టార్న్ షినవత్రా మాత్రం జైలులో తమ తండ్రితో కేవలం కుటుంబ విషయాలే మాట్లాడామని, రాజకీయాలు చర్చించలేదన్నారు. ఏది ఏమైనా థాక్సిన్ తాజా విడుదల థాయ్‌లాండ్‌లో కొత్త రాజకీయ సమీకరణలకు తెరతీస్తోంది.

ఇది కూడా చదవండి: సీఎం విజయ్ మాస్టర్ ప్లాన్: చక్రం తిప్పనున్న ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు!

Advertisement
 
Advertisement
Advertisement