అమెరికాకు ఇరాన్‌ కొత్త ప్రతిపాదన ఇదే.. | Trump To Review Iran New Proposal To End War | Sakshi
Sakshi News home page

అమెరికాకు ఇరాన్‌ కొత్త ప్రతిపాదన ఇదే..

May 3 2026 9:58 AM | Updated on May 3 2026 10:49 AM

Trump To Review Iran New Proposal To End War

యుద్ధం శాశ్వతంగా ముగించేందుకు ఇరాన్‌ 14 పాయింట్లతో కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ఇరాన్‌ ఒక పాకిస్తానీ మధ్యవర్తి ద్వారా 14 అంశాలతో కూడిన ప్రతిపాదనను వాషింగ్టన్‌కు పంపింది. యుద్ధ విరమణ.. ప్రాంతీయ భద్రత, ఆంక్షల తొలగింపు, ఇతర డిమాండ్లతో ముడిపడి ఉండాలని.. వీటన్నింటినీ 30 రోజుల్లోపు పరిష్కరించాలని ఇరాన్ కోరింది. అమెరికా ప్రతిపాదించిన 9 అంశాల ప్రణాళికకు ఇరాన్ అధికారికంగా ఈ 14 అంశాల వివరణాత్మక ప్లాన్‌తో సమాధానమిచ్చినట్లు ఓ వార్తాసంస్థ పేర్కొంది.

అమెరికా రెండు నెలల యుద్ధ విరమణను ప్రతిపాదించగా.. ఇరాన్ దానిని తిరస్కరించింది. అన్ని ప్రధాన సమస్యలను 30 రోజుల్లోనే పరిష్కరించాలని పట్టుబట్టింది. భవిష్యత్తులో సైనిక దాడులు జరగకుండా హామీ ఇవ్వాలని.. ఇరాన్ సరిహద్దు ప్రాంతాల నుండి అమెరికా దళాలను ఉపసంహరించుకోవాలని, నౌకాదళ దిగ్బంధనాన్ని ముగించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. నిలిపివేసిన తమ ఆర్థిక ఆస్తులను విడుదల చేయాలని, నష్టపరిహారం చెల్లించడంతో పాటు సుదీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని కోరింది.

ఈ శాంతి ఒప్పందం కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా.. లెబనాన్‌తో సహా అన్ని వైపులా పోరాటాలను ముగించాలని ఇరాన్ కోరింది. అలాగే, వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధిలో భద్రత, రవాణా నియంత్రణ కోసం కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా స్పందిస్తూ.. ఈ కొత్త ప్రతిపాదనను సమీక్షిస్తానని చెబుతూనే.. దశాబ్దాలుగా టెహ్రాన్ చేసిన చర్యలకు ఇంకా తగినంత భారీ మూల్యం చెల్లించలేదని పేర్కొన్నారు. తాను త్వరలోనే ఇరాన్ పంపిన ఈ ప్రణాళికను పరిశీలిస్తానని.. అయితే ఇది ఆమోదయోగ్యంగా ఉంటుందని తాను ఊహించలేకపోతున్నానని ఆయన రాసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement