
హాలీవుడ్ నటుడు సీన్ పెన్
వాషింగ్టన్: వ్యక్తిగత జీవితంతోనే కాదు.. రాజకీయ అభిప్రాయాలతోనూ వివాదాస్పదమైన హాలీవుడ్ నటుడు సీన్ పెన్ (Sean Penn) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారాన్ని నిలుపుకోవడానికి ప్రపంచాన్ని నాశనం చేస్తారన్నారు. అంతేకాదు.. హంతకుడైన అసూయపూరిత జీవిత భాగస్వామిగా అభివర్ణించారు. డెమొక్రటిక్ ప్రతినిధి ఎరిక్ స్వాల్వెల్‌తో కలిసి జిమ్ అకోస్టా పాడ్ కాస్ట్ ‘ది జిమ్ అకోస్టా షో’లో పెన్ మాట్లాడారు.
తనకు కాకపోతే ఇంకెవ్వరికీ దక్కవద్దన్న ధోరణి ట్రంప్‌లో ఉంటుందన్నారు. తన అధికారంతో విధ్వంసానికి పాల్పడే స్వార్థపూరిత వ్యక్తిగా ట్రంప్‌ను అభివర్ణించారు. మూడోసారి అధ్యక్ష పదవికోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు పెన్ పైవిధంగా సమాధానమిచ్చారు.
ఇక డెమొక్రాట్ అయిన ఎరిక్ స్వాల్వెల్ (Eric Swalwell) మాట్లాడుతూ.. నియంతలెప్పుడూ తమ వారసత్వాన్ని కొనసాగించడానికి ప్రణాళికలు వేయలేదన్నారు. తనను తాను రక్షించుకోవడానికి దేశాన్ని ఏం చేయడానికైనా ట్రంప్ సిద్ధమవుతారని వ్యాఖ్యానించారు.