పాకిస్థాన్ భయంకర వ్యూహం.. చైనాతో ‘అణు’ డీల్‌కు రహస‍్యంగా.. | Trump favourite Field Marshal asked China for nuclear submarines | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ భయంకర వ్యూహం.. చైనాతో ‘అణు’ డీల్‌కు రహస‍్యంగా..

May 18 2026 7:14 PM | Updated on May 18 2026 8:22 PM

Trump favourite Field Marshal asked China for nuclear submarines

పాకిస్థాన్‌ రక్షణ వ్యవస్థ ఏం చేసినా భారత్‌ను దృష్టిలో పెట్టుకునే చేస్తుంది. భారత్‌ త్రివిధ దళాల వద్ద ఉన్న విధ్వంసకర ఆయుధాలను చూసి పాక్‌ భయపడుతుంది. భారత్‌లో ఎటువంటి ఆయుధాలు ఉన్నాయో, ఎలాంటి అణ్వాయుధ వ్యవస్థలు ఉన్నాయో అటువంటివి అభివృద్ధి చేసుకోవాలని భావిస్తుంది. కానీ, అగ్ర దేశాల వద్ద అప్పులు అడుక్కునే పాక్‌ ఎన్నో రకాల ఆయుధాలను తన అమ్ములపొదిలో చేర్చుకోలేకపోయింది. 

ప్రపంచంలో 6 దేశాలకు అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల ఆధారిత సముద్ర అణు నిరోధక వ్యవస్థ ఉంది. అవే.. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌, యూకే, భారత్‌. ఇక ఇజ్రాయెల్‌ వద్ద క్రూయిజ్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు ఉన్నాయి. ఉత్తర కొరియా వద్ద అణు బాలిస్టిక్ క్షిపణిని మోసే ఒక సంప్రదాయ జలాంతర్గామి ఉంది. భారత్‌కు అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల ఆధారిత సముద్ర అణు నిరోధక వ్యవస్థ ఉండడంతో తమకూ కావాలని పాక్‌ ప్రయత్నాలు జరిపింది.

చైనా నౌకాదళం తమ గ్వాదర్ పోర్ట్‌ను శాశ్వతంగా వినియోగించుకునే అవకాశం ఇస్తామని పాకిస్థాన్ చెప్పినట్లు తెలుస్తోంది. దానికి ప్రతిఫలంగా అణుదాడి చేయగల సామర్థ్యం ఉన్న జలాంతర్గాములు లేదా అణు ఆయుధ వ్యవస్థను ఇవ్వాలని చైనాను పాక్‌ కోరిందని అమెరికాకు చెందిన ‘‘డ్రాప్‌ సైట్‌ న్యూస్‌’’ పేర్కొంది. శత్రుదేశం ముందుగా అణుదాడి చేసినా.. జలాంతర్గాముల నుంచి తిరిగి అణుదాడి చేసే శక్తిని పొందాలని పాక్‌ భావిస్తోంది. దీన్ని అణు నిరోధక వ్యవస్థలో అత్యంత కీలక భాగంగా భావిస్తారు.

పాక్‌ సైన్య రహస్య పత్రాలను పరిశీలించి.. 
పాకిస్థాన్ సైన్య రహస్య పత్రాలను పరిశీలించామని, దాని ఆధారంగా ఈ విషయాన్ని చెబుతున్నామని ‘‘డ్రాప్‌ సైట్‌ న్యూస్‌’’ తెలిపింది. 2024లో పాకిస్థాన్ సైన్యం-చైనా ద్వైపాక్షిక చర్చల్లో ఈ డిమాండ్ వచ్చిందని పేర్కొంది. ఆ సమయంలో పాకిస్థాన్ సైన్యానికి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్‌ నాయకత్వం వహించాడు. 2024 ఆరంభంలో గ్వాదర్‌ను చైనా సైన్యానికి శాశ్వత స్థావరంగా మార్చేందుకు అనుమతి ఇస్తామని చైనాకు పాకిస్థాన్ రహస్యంగా హామీ ఇచ్చింది. 

ఆ తర్వాత అదే ఏడాది అణ్వాయుధాలు మోసే జలాంతర్గాములు ఇవ్వాలని చైనాను కోరింది. దీంతో ఇప్పటికే పాక్‌ వద్ద ఉన్న గగనతల, భూతల అణ్వాయుధాల ద్వంద్వ వ్యవస్థను సముద్ర వ్యూహాత్మక ఆయుధాలతో కూడిన త్రివిధ వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డిమాండ్ అసంబద్ధమని చైనా భావించడంతో చర్చలు నిలిచిపోయాయి.

ఇమ్రాన్ ఖాన్‌ను అధికారంలో నుంచి తొలగించాలని ఒత్తిడి తెచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ అడ్మినిస్ట్రేటివ్‌లోని కీలక అధికారి రహస్య కేబుల్ వివరాలు కూడా ‘‘డ్రాప్‌ సైట్‌ న్యూస్‌’’ వెల్లడించింది. దీంతో, అణ్వాయుధాలు కలిగిన పాకిస్థాన్.. అటు చైనా, ఇటు అమెరికాతో చర్చోపచర్చలు జరిపినట్టు స్పష్టమైంది. గత ఐదేళ్లలో అమెరికా-పాకిస్థాన్ సంబంధాలను మలిచిన పరిణామాలను ఈ కథనం వివరించింది. అమెరికాతో సన్నిహితంగా ఉంటూనే.. వ్యూహాత్మక ఆయుధాలు ఇవ్వాలని చైనాతోనూ పాకిస్థాన్ బేరసారాలు జరిపింది.

అణ్వాయుధాలు మోసే జలాంతర్గాములు 3 రకాలుగా ఉంటాయి.. అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు, క్రూయిజ్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు, బాలిస్టిక్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు.

ఈ మూడింట్లో పాకిస్థాన్ దేన్ని కోరిందో పాకిస్థాన్ కథనంలో స్పష్టత లేదు. 1970 చివర, 1980 ఆరంభంలో చైనా సహకారంతో పాకిస్థాన్ అణుబాంబు తయారుచేసింది. రహస్య అణు సాంకేతిక బదిలీల్లో ఇదే తొలి ఉదాహరణగా భావిస్తున్నారు. అధిక సాంద్రత యురేనియం సరఫరాతో పాటు, 1960లలో పరీక్షించిన 12 కిలోటన్నుల సామర్థ్యమున్న సీహెచ్‌ఐసీ-4 అణు విస్ఫోటక రూపకల్పనను కూడా పాకిస్థాన్‌కు చైనా ఇచ్చింది. 1990లలో అణ్వాయుధాలను ప్రయోగించే ఎం-11 మధ్యదూర బాలిస్టిక్ క్షిపణులను కూడా పాకిస్థాన్‌కు చైనా విక్రయించింది.

ఈ ఆయుధాలతో గగనతలం, భూమి నుంచి ప్రయోగించే ద్వంద్వ అణు వ్యవస్థను పాకిస్థాన్ తయారుచేసుకుంది. కానీ త్రివిధ వ్యవస్థలో మూడో భాగమైన సముద్ర ఆధారిత అణ్వాయుధ సామర్థ్యం మాత్రం సాంకేతిక, ఆర్థిక పరిమితుల వల్ల సాధ్యం కాలేదు.

సముద్రం అడుగునుంచి ప్రయోగించే అణ్వాయుధాను అత్యంత శక్తివంతమైన ఆయుధాలుగా భావిస్తారు. శత్రువు తొలి అణుదాడి చేసినా, తీవ్ర నష్టం జరిగిన తర్వాత కూడా ప్రతిదాడి చేయొచ్చు. 2017లో 450 కిలోమీటర్ల పరిధితో జలాంతర్గామి నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించి త్రివిధ అణు వ్యవస్థ పూర్తి చేశామని పాకిస్థాన్ ప్రకటించింది. కానీ పాకిస్థాన్ వద్ద కేవలం 5 క్రియాశీల సంప్రదాయ జలాంతర్గాములు మాత్రమే ఉండటం, క్షిపణి పరిధి తక్కువగా ఉండటం వల్ల ఇది ప్రాథమిక స్థాయి సముద్ర అణు నిరోధక వ్యవస్థగానే మిగిలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement