
స్టార్‌లైనర్ మరో ఏడాదిదాకా ఎగరలేదు
ఖాళీలేకుండా బిజీబిజీగా అంతరిక్షయానాలు
తీరికలేకుండా గడుపుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
2026 ఏడాదిలో బోయింగ్ స్పేస్‌క్రాఫ్ట్‌కు ఛాన్స్
వాషింగ్టన్: తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం కోసం వరసబెట్టి భక్తులు క్యూ లైన్లలో నిల్చున్నట్లు ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కి సైతం వ్యోమ నౌకలు ఒకరకంగా క్యూ కట్టాయి. కొద్ది వారాల వ్యవధిలో సరకు రవాణా స్పేస్‌క్రాఫ్ట్ లేదా వ్యోమగాములను తీసుకొచ్చే వ్యోమనౌకలు ఒకదాని వెంట మరోటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తూ ఐఎస్‌ఎస్ మార్గాన్ని బిజీగా మార్చేశాయి.
నాసా, రోస్‌కాస్మోస్, స్పేస్ ఎక్స్ సంస్థల వ్యోమనౌకలు తమ వంతు కోసం వేచిచూస్తున్నాయి. బోయింగ్ వారి ప్రతిష్టాత్మక స్టార్‌లైనర్ వ్యోమనౌక మరో ఏడాదిదాకా ఐఎస్‌ఎస్‌కు పయనమయ్యే అవకాశం దక్కదని తాజా షెడ్యూల్‌ను బట్టి తెలుస్తోంది. చరిత్రలో ఎన్నడూలేనంతగా ఐఎస్‌ఎస్‌కు స్పేస్‌క్రాఫ్ట్‌ల రాకపోకలు ఇటీవ లకాలంలో ఎక్కువయ్యాయి.
గత రెండు మూడు వారాలపాటు యాగ్జియం–4 మిషన్ వారి డ్రాగన్ ‘గ్రేస్’ క్యాప్సూల్ ఐఎస్‌ఎస్ ‘ఔట్‌పోస్ట్’ వద్ద ‘పార్కింగ్’లో ఉండిపోయింది. ఇటీవలే అది భారత వ్యోమగామి శుభాంశు శుక్లాసహా నలుగురు వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకొచ్చింది. దీంతో క్రూ–11 మిషన్ ప్రయోనికి రంగం సిద్ధమైంది. ఇదిగాక ఇప్పటికే ఐఎస్‌ఎస్ వద్ద రష్యా అంతరిక్ష సంస్థ పంపిన ప్రోగ్రెస్–92 కార్గోషిప్ అక్కడ తిష్టవేసింది. దీంతోపాటు మరోమూడు వ్యోమనౌకలు ఐఎస్‌ఎస్ వద్దే ఉన్నాయి. స్పేస్‌ఎక్స్ డ్రాగన్, సోయూజ్ ఎంఎస్–27, ప్రోగ్రెస్ రీ–సప్లై నౌకలు అక్కడ ఉన్నాయి.
చాలా రోజులుగా ఐఎస్‌ఎస్‌లో విధుల్లో ఉండి అలసిపోయిన వ్యోమగా ములను భూమి మీదకు తీసుకొచ్చేందుకు, అక్కడ నిండుకున్న సరుకులను భూమి నుంచి మోసుకొచ్చేందుకు తరచూ ఇలా వ్యోమనౌకలు ఐఎస్‌ఎస్‌కు వస్తూనే ఉన్నాయి. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ల ట్రాఫిక్ ఈ ఏడాది చివరిదాకా కొనసాగనుంది. డిసెంబర్‌లోపు మరో ఆరు వ్యోమనౌకలు అక్కడికి చేరుకోనున్నాయి.
కొత్త వ్యోమగాములను మోసుకెళ్లడం, సరకుల తరలింపు, ఆధునిక శాస్త్రసాంకేతికత సంబంధ ఉపకరణాలను మోసుకుంటూ ఇవి అటూఇటూ తిరగనున్నాయి. అత్యంత బరువైన ప్రయోగ పేలోడ్‌లను తరలించనున్నాయి. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన 2000 సంవత్సరం నుంచి చూస్తే ఐఎస్‌ఎస్‌కు ఇంతటి భారీ ఎత్తున వ్యోమగాములు, సరకులు, ప్రయోగ పరికరాల రాకపోకలు పెరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. అమెరికా నాసా, రష్యా వారి రోస్‌కాస్మోస్, ఎలాన్‌మస్క్ స్పేస్‌ఎక్స్, స్టార్‌లైనర్ ఇలా అన్ని సంస్థల స్పేస్‌క్రాఫ్ట్‌లు అంతరిక్షయానాన్ని బిజీగా మార్చాయి.
క్యూ వరస నుంచి తప్పుకున్న స్టార్‌లైనర్
భారతీయ మూలాలున్న మహిళా అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్‌సహా బుచ్ విల్మోర్‌ను బోయింగ్ వారి స్టార్‌లైనర్ వ్యోమనౌక 2024 జూన్‌లో ఐఎస్‌ఎస్‌కు పంపించింది. అయితే తిరుగుప్రయాణంలో అది మొరాయించడంతో వ్యోమగాములు లేకుండానే పలుసార్లు వాయిదాల తర్వాత ఒంటరిగా భూమికి తిరిగొచ్చింది. దీంతో 2025లో స్టార్‌లైనర్ మరోసారి ఐఎస్‌ఎస్‌కు వెళ్లలేదు. ఇలా స్పేస్‌షిప్‌ల ట్రాఫిక్ నుంచి ఇది తప్పుకుంది.
న్యూ మెక్సికోలోని నాసా వారి వైట్‌శాండ్స్ పరీక్షకేంద్రంలో ఈ స్టార్‌లైనర్ వ్యోమనౌకకు సమగ్రస్థాయిలో పరీక్షలు జరుపుతున్నారు. 2026లో జరపబోయే ఐఎస్‌ఎస్ ప్రయాణానికి సురక్షితమేనా కాదా అనేది నిర్ధారించుకునేందుకు కీలక సమీక్షా పరీక్షలు జరుపుతున్నారు. నెలల తరబడి నిరీక్షణ తర్వాత సునీతా విలియమ్స్ చివరకు క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వ్యోమనౌకలో తిరుగుపయనమైన విషయం విదితమే. అంతర్జాతీయ అంతరిక్ష సందర్శకుల తాకిడి ఎక్కువైతే ఐఎస్‌ఎస్ మార్గం మరింత బిజీగా మారనుంది.