వాషింగ్టన్: సముద్ర జీవులైన ఆక్టోపస్‌లు సాధారణంగా ఒక మీటర్ పొడవు, 9 కిలోల వరకు బరువు ఉంటాయి. కానీ, కేవలం గోల్ఫ్ బంతి పరిమాణంలోని అతిచిన్న ఆక్టోపస్‌ను పసిఫిక్ మహాసముద్రంలో పరిశోధకులు గుర్తించారు. ఈక్వెడార్ తీరానికి సమీపంలో గాలాపాగోస్ దీవుల వద్ద సముద్ర ఉపరితలం నుంచి 6 వేల అడుగుల లోతున చిమ్మచీకటిలో ఇది సంచరిస్తుండగా జాగ్రత్తగా బయటకు తీశామని చెబుతున్నారు.
ఇది ఇప్పటిదాకా ఎవరికీ తెలియని కొత్తరకం ఆక్టోపస్ అని అంటున్నారు. గాలాపాగోస్ దీవులు అరుదైన జీవజాలానికి నిలయంగా మారాయి. భూమిపై మరెక్కడా కనిపించని వెయ్యికి పైగా వృక్ష, జంతు జాతులు ఇక్కడున్నాయి. ఈ ద్వీపాల చుట్టూ ఉన్న లోతైన జలాల్లో కొత్తరకం ఆక్టోపస్ ఉనికి తొలిసారిగా బయటపడింది. ఈ నీలి రంగు బుల్లి ఆక్టోపస్‌కు మైక్రోఎలిడోన్ గాలాపాగెన్సిస్ అని పేరుపెట్టారు.
షికాగోలోని ఫీల్డ్ మ్యూజియం, చార్లెస్ డారి్వన్ ఫౌండేషన్, గాలాపాగోస్ నేషనల్ పార్క్ డైరెక్టరేట్‌లోని సైంటిస్టులు 2015 నుంచి సంయుక్తంగా ఈ పరిశోధన చేశారు. ఈవీ నాటిలస్ అనే అన్వేషణ నౌక ద్వారా లోతైన సముద్ర యాత్రలో ఆక్టోపస్‌ను మొదటిసారిగా గుర్తించారు. ఓడ నుంచి సిబ్బంది రిమోట్‌తో పనిచేసే అండర్‌వాటర్ రోబోను సముద్రం అడుగుభాగంలోకి పంపించారు. సముద్ర ఉపరితలం నుంచి 5,800 అడుగుల లోతులో ఒక పర్వతం సమీపంలో ఆక్టోపస్‌ను గమనించి, రోబోటిక్ వాహనాన్ని ఉపయోగించి పట్టుకున్నారు.
గోల్ఫ్ బంతి పరిమాణంలో ఉన్న నీలిరంగు చిన్న ఆక్టోపస్ చాలా ప్రత్యేకంగా కనిపించింది. కొత్త ఆక్టోపస్ జాతిని అధ్యయనం చేయాలంటే సాధారణంగా దానికి కోసి చూడాల్సి ఉంటుంది. కానీ, గోల్ఫ్ బంతి పరిమాణంలోని ఆక్టోపస్ ఇదొక్కడే దొరకడంతో జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. మైక్రో సీటీ స్కానింగ్‌తో ఆక్టోపస్ శరీరం లోపలి భాగాలను పరిశీలించారు. 3డీ నమూనాను తయారు చేశారు. దానికి అధికారికంగా ఒక కొత్త జాతి ఆక్టోపస్‌గా ధ్రువీకరించారు. సువిశాలమైన మన భూగోళంపై ఇప్పటిదాకా మానవుడి దృష్టికి రాని జీవులు ఎన్నో ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.


