దారుణం: పిల్లాడిని లాగేసుకున్న ట్రెడ్‌మిల్‌

Terrifying Video Shows Child Being Dragged Under Treadmill - Sakshi

వైరలవుతోన్న వీడియో.. జాగ్రత్త అంటూ హెచ్చరిక

వాషింగ్టన్‌: ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ పని చేస్తున్నా ఓ కంట వారిని కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే చిన్నారులు తమ కళ్ల ముందు కనిపించే ప్రతిదాన్ని తాకి చూడాలని.. వీలైతే ఆయా వస్తువులతో ఆడుకోవాలని భావిస్తారు. అలాంటప్పుడు వారికి అందేంత ఎత్తులో కానీ.. కింద కానీ ఎలాంటి ప్రమాదకర వస్తువులు ఉంచకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థుతుల్లో ఉంచాల్సి వచ్చినా.. చిన్నారులను ఆ సమక్షంలోకి రానివ్వకూడదు. అలా కాదని మనం ఏ కాస్త ఏమరపాటుగా ఉన్నా.. ఇదిగో ఈ వీడియోలో చూపించినటువంటి  భయంకర అనుభవం ఎదుర్కొవాల్సి వస్తుంది. 

దీనిలో ఇద్దరు పిల్లలు ట్రెడ్‌మిల్‌ వద్ద ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో ఓ చిన్నారి చేతులోని బెలూన్‌ ట్రెడ్‌మీల్‌ పడిపోవడంతో దాన్ని అందుకోవడం కోసం ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో చిన్నారి ట్రెడ్‌మీల్‌ కిందకు పూర్తిగా వెళ్లిపోతాడు. చివరకు ఎలాగో అలా బయటపడతాడు. ఇందుకు సంబంధించిన వీడియోని అమెరికాకు చెందిన కన్జుమర్‌ ప్రొడక్ట్‌ సేప్టీ కమిషన్‌(సీపీఎస్‌సీ) తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు చిన్నారులు ఇంట్లో ట్రెడ్‌మీల్‌ వద్ద ఆడుకుంటూ ఉంటారు. అప్పటికి అది ఆన్‌ చేసి ఉంటుంది. వీరిలో పాప ట్రెడ్‌మిల్‌ మీద నడుస్తుండగా.. మరో చిన్నారి చేతిలో బెలూన్‌తో ట్రెడ్‌మిల్‌ పక్కన ఆడుకుటుంటూ ఉంటాడు. 

ఇంతలో ఆ పిల్లాడు తన చేతిలోని బెలూన్‌ని ట్రెడ్‌మిల్‌ మీద పెట్టగా.. అది అలా వెళ్లిపోతుంది. దాన్ని లాక్కోవడం కోసం పిల్లాడు ట్రెడ్‌మిల్‌ మీద చేతులు పెడతాడు. దాంతో బెలూన్‌తో పాటు చిన్నారి చేతులు కూడా ట్రెడ్‌మిల్‌ కింద ఇరుక్కుంటాయి. అది చూసిన పాప తన తల్లిదండ్రులను పిలిచేందుకు ఇంట్లోకి పరిగెడుతుంది. ఈ లోపు పిల్లాడు ఎంతో కష్టపడి చేతులను బయటకు లాక్కున్నా.. రెండోసారి మళ్లీ ట్రెడ్‌మిల్ అతడిని లాగేసుకుంది. ఈ సారి పూర్తిగా ట్రెడ్‌మిల్ కిందకి వెళ్లిపోయాడు. ఆ బాధను తట్టుకోలేక విలవిల్లాడాడు. 

ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. చివరికి ఆ పిల్లాడు తనంతట తానే దాన్ని విడిపించుకుని ఏడుస్తూ వెళ్లిపోవడం కనిపించింది. ట్రెడ్‌మిల్ ఇళ్లల్లో ఉంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పేందుకే ఈ వీడియోను షేర్ చేశారు. ఇప్పటివరకు ఇలాంటి ట్రెడ్‌మిల్ వల్ల ఒకరు చనిపోగా, కొంతమంది పిల్లలు దాని కింద నలిగి గాయపడ్డారని సీపీఎస్‌పీ పేర్కొంది. ఇలాంటి ఘటనలకు సంబంధించి సుమారు 39 ఫిర్యాదులు తమకు అందాయని తెలిపింది. ఇంట్లో ఇలాంటి ట్రెడ్‌మిల్‌ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

చదవండి: వైరల్‌ వీడియో: దీని నటనకు ఆస్కార్‌ ఇచ్చినా తక్కువే..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top