మిషన్ 6జీ.. 5జీ కంటే వందరెట్ల వేగంగా నెట్‌ స్పీడ్‌.. భారత్‌ భారీ ప్లాన్‌!

Start 6G Telecom Research in India - Sakshi

దక్షిణ కొరియా, జపాన్‌తో పోటీగా భారత్‌

5జీ సేవలొచ్చిన ఆరు నెలల్లోనే 6జీ సేవలపై అధ్యయనం

2030 నాటికి అందుబాటులోకి తెచ్చే లక్ష్యం

సామాజికంగా విప్లవాత్మకమైన మార్పులు 

మొబైల్‌ వినియోగదారులు మనకే ఎక్కువ  

టెలికమ్యూనికేషన్‌ రంగంలో ప్రపంచ దేశాలతో భారత్‌ పోటీ పడుతోంది. 5జీ సేవల్ని 125 నగరాల్లో అందుబాటులోకి తెచ్చి ఆరు నెలలైందో లేదో 6జీపై అధ్యయనం కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం  ఒక విజన్‌ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. 2030 నాటికి దేశంలో 6జీ సేవలు అందుబాటులోకి తెచ్చి ప్రజా జీవనంలోనూ, సామాజికంగా సమూల మార్పు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. 6జీని ఒక మిషన్‌లా తీసుకువెళ్లి దక్షిణ కొరియా, చైనా, జపాన్‌ వంటి దేశాల సాంకేతికతతో పోటీపడతామని సగర్వంగా ప్రకటించింది.

ప్రస్తుతం భారతీయులు 100 కోట్ల మొబైల్‌ ఫోన్లను వాడుతున్నారు. ఇంటర్నెట్‌ వాడే వారి సంఖ్య 2014లో 25 కోట్లు ఉంటే ఇప్పుడు 85 కోట్లకు చేరుకుంది. ఇక ఏడాదికేడాది స్మార్ట్‌ ఫోన్లు వాడే సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 30 కోట్ల గృహాలకు చెందిన వారు ఏడాదికి 16 కోట్ల కంటే ఎక్కువగానే స్మార్ట్‌ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. అంటే ప్రతీ ఇంటివారు రెండేళ్లకి ఒకసారి కొత్త ఫోన్‌ను కొంటున్నట్టు లెక్క. భారతీయులు ఫోన్‌ లేకుండా ఒక నిముషం కూడా గడిపే పరిస్థితి లేదు.

అన్ని పనులు ఫోన్‌ద్వారా చేస్తున్నారు. ఏదైనా బిల్లు కట్టాలన్నా, సినిమాలు చూడాలన్నా, ఆన్‌లైన్‌ క్లాసులు వినాలన్నా , బ్యాంకింగ్‌ లావాదేవీలు, యూపీఐ చెల్లింపులు ఇలా.. ఏ పనైనా అరచేతిలో ఉన్న ఫోన్‌తోనే. అందుకే స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌ కూడా మన దగ్గరే ఎక్కువ. 6జీ ద్వారా నెట్‌ స్పీడ్‌ పెరిగితే మరింత సులభంగా పనులన్నీ అయిపోతాయి. ఆ మేరకు మార్కెట్‌ కూడా విస్తృతమవుతుంది. పదేళ్లలో 6జీ సేవలు అందుబాటులోకి తెచ్చేలా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది.  

ఏమిటీ 6జీ...?
టెలికమ్యూనికేషన్‌ రంగంలో ఆరో తరం సేవల్ని 6జీ అంటారు. 5జీ సేవలు పూర్తిగా విస్తరించకుండానే 6జీపై కేంద్రం పరిశోధనలు మొదలు పెట్టింది. 5జీ కంటే దీని నెట్‌ స్పీడ్‌ వందరెట్లు వేగంగా ఉంటుంది. సెకనుకు ఒక టెరాబైట్‌ వేగంతో పని చేస్తుంది. క్షణ మాత్రం ఆలస్యం లేకుండా డేటా ట్రాన్స్ఫర్‌ అవుతుంది.  

కేంద్రం ప్రణాళికలు ఇవే ..!  
భారత్‌ 6జీ ప్రాజెక్టును రెండు దశల్లో అమలు చేస్తారు. తొలి దశలో ప్రధానంగా పరిశోధనలపై ఫోకస్‌ ఉంటుంది. రెండో దశలో వాణిజ్యపరంగా 6జీ సేవల వాడకంపై సమగ్ర అధ్యయనం జరుగుతుంది. ప్రాజెక్టు పర్యవేక్షణకు కేంద్రం అత్యున్నత కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. 6జీ ప్రమాణాలు, స్పెక్ట్రమ్‌ల గుర్తింపు, సిస్టమ్స్, డివైజ్‌లకు ఎకో సిస్టమ్‌ ఏర్పాటు, పరిశోధన, అధ్యయనాలకు ఆర్థిక సాయం తదితరాలను ఈ కౌన్సిల్‌ పర్యవేక్షిస్తుంది.

రూ.10వేల కోట్లతో ఒక కార్పస్‌ ఫండ్‌ను ఏర్పాటు చేసి 6జీపై తొలిదశ పరిశోధనలు మొదలు పెట్టనున్నారు. మొత్తంగా 6జీ పరిశోధనలకు రూ. 63 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలున్నాయి. కొత్త సాంకేతిక వ్యవస్థలైన టెరాహెర్‌ట్జ్‌ కమ్యూనికేషన్, రేడియో ఇంటర్‌ఫేసెస్, టాక్టిల్‌ ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, కొత్త ఎన్‌కోడింగ్‌ పద్ధతులు, 6జీ పరికరాలకు అవసరమయ్యే చిప్‌ సెట్స్‌ వంటివాటిపై కూడా ప్రధానంగా అత్యున్నత మండలి దృష్టి పెడుతుంది.

ఎలాంటి మార్పులు వస్తాయి?
► 6జీ అందుబాటులోకి వస్తే ఫ్యాక్టరీలన్నీ రిమోట్‌ కంట్రోల్‌తో ఆపరేట్‌ చేయొచ్చు
► రియల్‌–టైమ్‌ గేమింగ్‌ ఇండస్ట్రీకి కొత్త హంగులు చేకూరుతాయి.  
► స్వయంచోదక కార్లు రోడ్లపై ఇక పరుగులు తీస్తాయి  
► డేటా ట్రాన్స్‌ఫర్‌ జాప్యం లేకుండా క్షణాల్లో జరగడం వల్ల సుదూరంలో ఉండి కూడా సర్జరీ చేసే అవకాశం ఉంటుంది.
► 6జీ సపోర్ట్‌తో నడిచే డివైజ్‌లన్నీ బ్యాటరీలతో నడుస్తాయి. దీంతో బ్యాటరీ తయారీ రంగం పరుగులు పెడుతుంది
► ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేధ) మరో దశకు చేరుకుంటుంది.  
► ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద ఉన్న డిజిటల్‌ ఇండియా, రూరల్‌ బ్రాడ్‌బ్యాండ్, స్మార్ట్‌ సిటీలు, ఈ–గవర్నెన్స్‌ వంటివి పుంజుకుంటాయి.  
► రేడియో ఫ్రీక్వెన్సీ వినియోగం మరింత సామర్థ్యంతో పని చేస్తుంది. ఎలాంటి నెట్‌వర్క్‌ సమస్యలు లేకుండా ఒకేసారి అత్యధిక డివైజ్‌లకు నెట్‌ కనెక్షన్‌ ఇవ్వొచ్చు. 5జీతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ పరికరాలకు 6జీ కనెక్షన్‌ ఒకేసారి ఇచ్చే అవకాశముంటుంది.  
► వైర్‌లెస్‌ కమ్యూనికేషన్లలో విప్లవాత్మక మార్పులు రావడంతో పర్యావరణం అనుకూలంగా ఉంటుంది. 5జీ రేడియేషన్‌తో పర్యావరణానికి దెబ్బ ఎక్కువగా ఉందనే ఇప్పటికే విమర్శలున్నాయి.  
► సామాజికంగా పలు మార్పులు చోటు చేసుకుంటాయి. అత్యంత వేగంతో పనిచేసే ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడం వల్ల ఎక్కడ నుంచైనా పని చేసే అవకాశం ఉంటుంది. దీంతో పల్లెలు, పట్టణాల మధ్య తేడా తగ్గిపోతుంది. పల్లెల నుంచి వలసల్ని నిరోధించవచ్చు
► 6జీ  సర్వీసులు అందరికీ అందుబాటులోకి రావడం, ఎక్కడ నుంచైనా రిమోట్‌ కంట్రోల్‌తో ఆపరేట్‌ చేసే అవకాశాలు ఉండడంతో గ్రామీణ జీవనంలో కూడా విప్లవాత్మక మార్పులు వస్తాయి.

ఇతర దేశాల్లో ఎలా..?
► 6జీ సేవల్లో ప్రస్తుతం దక్షిణ కొరియా ముందంజలో ఉంది. రూ.1200 కోట్ల పెట్టుబడులతో 2025కల్లా తొలి దశ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది.  
► జపాన్‌లో ఐఒడబ్ల్యూఎన్‌ ఫోరమ్‌ 6జీ సేవలపై 2030 విజన్‌ డాక్యమెంట్‌ని విడుదల చేసింది.  
► చైనా 6జీపై 2018లోనే అధ్యయనం ప్రారంభించింది. 2029లో అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.  
► అమెరికా కూడా ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ (ఎఫ్‌సీసీ)తో కలిసి 2018లో 6జీపై అధ్యయనాలు మొదలు పెట్టింది. యాపిల్, గూగుల్‌ వంటి కంపెనీలతో కూడా కలిసి పనిచేస్తోంది.

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top