టెక్నాలజీతోనే సామాజిక న్యాయం

PM Modi addresses the India-Italy Technology Summit - Sakshi

సీఐఐ ఇండియా– ఇటలీ టెక్నాలజీ సమిట్‌లో మోదీ

న్యూఢిల్లీ: సామాజిక న్యాయం, సాధికారత, పారదర్శకత, సమ్మిళితం సాధించేందుకు భారత్‌ సాంకేతికతను మాధ్యమంగా ఉపయోగించుకుంటోందని ప్రధాని మోదీ తెలిపారు. అట్టడుగు వర్గాలకు కూడా ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా అందించేందుకు తాము టెక్నాలజీని వినియోగించుకుంటున్నామన్నారు.

మంగళవారం ఇటలీ ప్రధాని గిసెప్‌ కాంటేతో కలిసి కేంద్ర శాస్త్ర– సాంకేతిక శాఖ (డీఎస్టీ)–సీఐఐ ఇండియా– ఇటలీ టెక్నాలజీ సమిట్‌లో మోదీ మాట్లాడారు. ఇటలీ సహా అనేక దేశాల ఉపగ్రహాలను తక్కువ వ్యయంతోనే అంతరిక్షంలోకి పంపించడం ద్వారా వినూత్న పరిష్కారాలను చూపుతూ భారత్‌ తన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోందన్నారు. అంతరిక్ష రంగంలో భారత్‌ సాధించిన విజయాలు నాణ్యత, నవకల్పనలకు ఉదాహరణగా మారాయన్నారు.  

రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారం
రక్షణ, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత విస్తృతం చేసుకోవాలని భారత్, ఇటలీ నిర్ణయించాయి. ఒక్క రోజు పర్యటన కోసం మంగళవారం ఢిల్లీ చేరుకున్న ఇటలీ ప్రధాని గిసెప్‌ కాంటేతో మోదీ సమావేశమై పలు ప్రాంతీయ, జాతీయ అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. దేశాల మధ్య అనుసంధానత అంతర్జాతీయ సూత్రాలు, ప్రమాణాలు, చట్టం, సానుకూలత ఆధారంగానే జరగాలని చైనా చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ నుద్దేశించి పరోక్షంగా పేర్కొన్నాయి.

ఈ మేరకు రెండు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.  2014లో అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్‌ల కుంభకోణం నేపథ్యంలో దెబ్బతిన్న సంబంధాలను బలోపేతం చేసుకుంటామని ఇటలీ తెలిపింది.  ‘ఉభయవర్గాలకు లాభం కలిగించేలా రక్షణ సంబంధాలను మరింత విస్లృతం చేసుకుంటాం. రైల్వేలు, మౌలికరంగాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్, పునరుత్పాదక ఇంధన వనరులు, విద్య, స్కిల్‌ డెవలప్‌మెంట్, సైన్స్‌ టెక్నాలజీ రంగాల్లో సహకారాన్ని విస్తృతం చేసుకుంటాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మోదీతో చర్చలు ఫలప్రదంగా సాగాయని ఇటలీ ప్రధాని కాంటే అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top