మాస్కో: ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం, అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం ముగింపు దశకు వస్తోందని శుభవార్త చెప్పారు. విక్టరీ డే పరేడ్ అనంతరం పుతిన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మాస్కో ఒక సంప్రదింపుల దశకు సిద్ధమవుతోందని అనడానికి ఇది ఆయన ఇచ్చిన అత్యంత బలమైన సంకేతం.
రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా భయంకరమైన పోరాటం సాగింది. ఈ క్రమంలో అమెరికా మద్దతుతో రష్యా, ఉక్రెయిన్ మూడు రోజుల కాల్పుల విరమణను ప్రారంభించాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి జరిగిన అతిపెద్ద ఖైదీల మార్పిడిలో భాగంగా చెరొక దేశం 1,000 మంది ఖైదీలను మార్చుకోవడానికి అంగీకరించిన తరుణంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ప్రకటన వెలువడిన సమయం వెంటనే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. క్రెమ్లిన్ సంవత్సరాలుగా సైనిక దృఢత్వాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది, కానీ రష్యా నాయకుడి తాజా వ్యాఖ్యలు తెరవెనుక పెరుగుతున్న దౌత్యపరమైన కదలికలను సూచించాయి.
మరోవైపు.. పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్-అమెరికా మధ్య వివాదం చాలా క్లిష్టంగా మారింది. అయితే, ఇరాన్ అణ్వాయుధాల తయారీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. రష్యాకు ఇరాన్‌తో పాటు పర్షియన్ గల్ఫ్ దేశాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇది మాకు కూడా సవాలుగా మారింది. ఇరు పక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాం. ఈ ఘర్షణ త్వరగా ముగుస్తుందని ఆశిస్తున్నా. దీన్ని కొనసాగించాలనే ఆసక్తి ఎవరికీ లేదని నేను భావిస్తున్నా. అయితే సమస్య పరిష్కారానికి ఇంకా రాజీ అవకాశాలు ఉన్నాయి' అని అభిప్రాయపడ్డారు.


