ప్లాస్టిక్‌ను తినేసే 'రోబో ఫిష్‌'.. సముద్రాల స్వచ్ఛతలో కీలక అడుగు!

Robot Fish that Eats Microplastics in Oceans Developed by China Scientists - Sakshi

బీజింగ్‌: సముద్రాల్లో మాటువేసిన ప్లాస్టిక్‌ కాలుష్యం ప్రపంచ దేశాలకు ఇప్పుడొక పెద్ద సమస్యగా మారిపోయింది. భూమిపై అన్ని సముద్రాల్లో 19.90 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉన్నట్లు నిపుణుల అంచనా. వీటిని తొలగించి, మహాసాగరాలను పరిశుభ్రంగా మార్చడానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు. సముద్రాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ సమస్యకు ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు చైనా శాస్త్రవేత్తలు. మెక్రోప్లాస్టిక్‌ను తినే రోబో చేపను తయారు చేశారు. ప్రపంచంలోని కలుషితమైన సముద్రాలను శుభ్రపరిచేందుకు ఏదో ఒకరోజు తమ రోబో ఉపయోగపడుతుందని నైరుతి చైనాలోని సిచువాన్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. 

స్పర్శకు మృదువుగా, కేవలం 1.3 సెంటీమీటర్లు (0.5 అంగుళాలు) పరిమాణంలోని ఈ రోబోలు ఇప్పటికే తక్కువ లోతైన నీటిలోని మైక్రోప్లాస్టిక్‌లను పీల్చుకుంటున్నట్లు తేలింది. అయితే.. అత్యంత లోతైన నీటిలోని మెక్రోప్లాస్టిక్‌ను సేకరించటమే లక్ష్యంగా పరిశోధకుల బృందం కృషి చేస్తోంది. అంతే కాదు ఈ రోబోల ద్వారా ఎప్పటికప్పుడు సముద్రాల కాలుష్యంపై వివరాలు తెలుసుకునేలా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు వాంగ్‌ యుయాన్‌ అనే శాస్త్రవేత్త. 'మేము అత్యంత తేలికపాటి సూక్ష్మీకరించిన రోబోట్‌ను తయారు చేశాం. దీనిని చాలా విధాలుగా ఉపయోగించవచ్చు. బయోమెడికల్‌, ప్రమాదక పనుల్లో ఇవి చాలా ఉపయోగపడతాయి. అయితే.. మేము ప్రధానంగా మెక్రోప్లాస్టిక్‌ను సేకరించటంపైనే దృష్టి సారించాం. ఇది ఒక నమూనా రోబో మాత్రమే. దీనిని పలుమార్లు ఉపయోగించవచ్చు. ' అని తెలిపారు. 

ఈ బ్లాక్ రోబోట్ చేప కాంతి ద్వారా వికిరణం చెంది.. దాని రెక్కలను తిప్పడం, శరీరాన్ని కదిలిస్తుంది. ఇతర చేపలతో ఢీకొట్టకుండా కాంతి ద్వారా ఆ రోబో చేపను శాస్త్రవేత్తలు నియంత్రించవచ్చు. ఒకవేళ ఏదైనా చేప దానిని మింగేస్తే సులభంగా జీర్ణమయ్యేలా పోలియురెథేన్‌తో తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. కాలుష్యకారకాలను ఈ చేపలు ఆకర్షిస్తాయి. అలాగే.. ఏదైన ప్రమాదం జరిగినప్పుడు వాటిని అవి పునరుద్ధరించుకుంటాయి. సాధారణ రోబోల కన్నా ఇవి 2.76 రెట్లు వేగంగా ఈదుతాయి కూడా.

ఇదీ చూడండి: భూగోళమంతటా ప్లాస్టిక్‌ భూతం.. సవాళ్లు ఎన్నున్నా.. స్వచ్ఛ సాగరం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top