UK: బ్రిటన్‌ ప్రధాని పీఠం కోసం...రిషి X ట్రస్‌

Rishi Sunak and Liz Truss are final candidates in race to UK Prime Minister - Sakshi

ఐదో రౌండ్‌లోనూ రిషియే టాపర్‌

రేసు నుంచి నిష్క్రమించిన మోర్డంట్‌

ట్రస్‌తో ఇక రిషి కీలక తుది పోరు

విజేతకే కన్జర్వేటివ్‌ పగ్గాలు, పీఎం పీఠం

సెప్టెంబర్‌ 5న తేలనున్న ఫలితం

లండన్‌: భారత మూలాలున్న బ్రిటన్‌ మాజీ మంత్రి రిషి సునాక్‌ (42) చరిత్ర సృష్టించేందుకు మరింత చేరువయ్యారు. బ్రిటన్‌ ప్రధాని పదవిని అధిష్టించే అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నేత ఎన్నికకు జరుగుతున్న పార్టీపరమైన పోరులో కీలకమైన తుది అంకానికి అర్హత సాధించారు. బుధవారం జరిగిన చివరిదైన ఐదో రౌండ్‌ పోరులో 137 మంది ఎంపీల మద్దతు సాధించి అగ్ర స్థానాన్ని నిలుపుకున్నారు.

ప్రధాని పదవికి గట్టి పోటీదారుగా అంతా భావించిన వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డంట్‌ అనూహ్యంగా 105 ఓట్లతో మూడో స్థానంలో నిలిచి రేసు నుంచి వైదొలిగారు! నాలుగో రౌండ్‌ దాకా మూడో స్థానంలో కొనసాగిన విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ కీలకమైన ఐదో రౌండ్‌ ముగిసే సరికి నాటకీయ పరిణామాల మధ్య 113 ఓట్లతో రెండో స్థానానికి ఎగబాకి తుది పోరుకు అర్హత సాధించారు.

మంగళవారం రేసు నుంచి తప్పుకున్న కేమీ బదెనోక్‌ తాలూకు 59 ఓట్లలో ఏకంగా 27 ఓట్లను సాధించడం ట్రస్‌కు బాగా కలిసొచ్చింది. వాటిలో మోర్డంట్‌ 13 ఓట్లు రాబట్టగా రిషికి 19 ఓట్లు పడ్డాయి. రిషి ఇక ట్రస్‌తో ముఖాముఖి తలపడతారు. సోమవారం ఆమెతో లైవ్‌ డిబేట్‌ ద్వారా అందుకు శ్రీకారం చుట్టనున్నారు.

అనంతరం ఆగస్టు 1 నుంచి దాదాపు నెల పాటు దశలవారీగా జరిగే పోలింగ్‌లో 1.6 లక్షల పై చిలుకు కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులు సీక్రెట్‌ బ్యాలెట్‌ పద్ధతిన ఓటింగ్‌లో పాల్గొంటారు. వీటిలో మెజారిటీ ఓట్లు సాధించేవారే కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా ఎన్నికవుతారు. తద్వారా ప్రధాని పీఠమూ ఎక్కుతారు. ఈ నేపథ్యంలో కీలకమైన టోరీ సభ్యుల మద్దతు కూడగట్టుకునేందుకు రిషి, ట్రస్‌ త్వరలో దేశవ్యాప్తంగా పర్యటిస్తారు.

ఇప్పటిదాకా రిషిదే హవా
పార్టీగేట్, పించర్‌గేట్‌ వంటి కుంభకోణాల్లో ఇరుక్కుని అబద్ధాలకోరుగా ఇంటాబయటా విమర్శల పాలై ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా చేయడం తెలిసిందే. ఆయన వారసుని ఎన్నిక ప్రక్రియలో భాగంగా రెండు వారాలుగా జరిగిన ఐదు రౌండ్ల పోరులోనూ రిషియే అగ్ర స్థానంలో నిలవడం విశేషం. ఆయనతో పాటు మొత్తం 8 మంది రంగంలోకి దిగగా భారత మూలాలున్న అటార్నీ జనరల్‌ సుయెల్లా బ్రేవర్మన్‌ తొలి రౌండ్‌లోనే తప్పుకున్నారు.

తర్వాత పాక్‌ మూలాలున్న నదీం జహావీ, జెరెమీ హంట్, టామ్‌ టగన్‌హాట్, కేమీ బదెనొక్‌ వరుసగా వైదొలిగారు. తాత్కాలిక ప్రధాని జాన్సన్‌ బుధవారం పార్లమెంటులో తుది ప్రసంగం చేశారు. కొత్త ప్రధాని పన్నులను తగ్గించాలని, అమెరికాతో సన్నిహిత బంధం కొనసాగించాలని సూచించారు. ‘హస్త ల విస్త బేబే (మళ్లీ కలుద్దాం)’ అంటూ ఎంపీలకు స్పానిష్‌లో వీడ్కోలు పలికారు.

మొగ్గు ట్రస్‌ వైపే!
కన్జర్వేటివ్‌ ఎంపీల మద్దతు విషయంలో రిషిదే పై చేయి అయినా కీలకమైన పార్టీ సభ్యుల్లో మాత్రం మెజారిటీ ట్రస్‌ వైపే మొగ్గుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే జరిగిన పలు సర్వేల్లో ఆమే ఫేవరెట్‌గా నిలిచారు. యూగవ్‌ పేరిట సోమ, మంగళవారాల్లో జరిగిన తాజా సర్వేలోనూ ఇదే తేలింది. అందులో పాల్గొన్న 725 మంది టోరీ సభ్యుల్లో 54 మంది ట్రస్‌ నెగ్గుతారని చెప్పగా 35 శాతం రిషిని సమర్థించారు. అయితే దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని బ్రిటిష్‌ పరిశీలకులు అంటున్నారు. ‘‘రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో లేబర్‌ పార్టీని ఓడించగల నేతకే టోరీ సభ్యులు జై కొడతారు. బరిలో ఉన్న ఇద్దరిలో ఆ సత్తా ఉన్నది రిషికే. కాబట్టి ఆయన విజయం ఖాయం’’ అని చెబుతున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top