మాక్రాన్‌ గెలుపుతో ఉక్రెయిన్‌కు ఊరట

Relief in Ukraine as Macron defeats Le Pen in French election - Sakshi

సహాయం కొనసాగిస్తామన్న ఫ్రాన్స్‌

పారిస్‌: ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా రెండోమారు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ విజయం సాధించడంతో ఉక్రెయిన్‌ ఊపిరి పీల్చుకుంది. అయితే గతంతో పోలిస్తే లీపెన్‌కు మద్దతు బాగా పెరిగినట్లు కనిపించింది. అతివాద నాయకురాలు లీపెన్‌ నెగ్గొచ్చన్న ఊహాగానాలు తొలుత యూరప్‌ హక్కుల సంఘాలకు, ఉక్రెయిన్‌ నాయకత్వానికి ఆందోళన కలిగించాయి. ఆమె బహిరంగంగా పుతిన్‌కు అనుకూలంగా మాట్లాడటం, ఈయూకు, నాటోకు వ్యతిరేకంగా గళమెత్తడంతో ఆమె అధ్యక్షురాలైతే తమకు ఒక పెద్ద అండ లోపిస్తుందని జెలెన్‌స్కీసహా ఉక్రెయిన్‌ నాయకత్వం భయపడింది.

లీపెన్‌ పదవిలోకి వస్తే జీ7లాంటి కూటములు కూడా ప్రశ్నార్థకమయ్యేవని జపాన్‌ ఆందోళన చెందింది. లీపెన్‌పై మాక్రాన్‌ విజయం సాధించినప్పటికీ ఆయన్ను వ్యతిరేకిస్తున్నవారి సంఖ్య స్వదేశంలో పెరిగిపోతోంది. ఈ అంశాన్ని గుర్తించిన మాక్రాన్‌ స్వదేశంలో తనను వ్యతిరేకిస్తున్నవారి ధోరణికి కారణాలు కనుగొంటానని, వారిని సంతృప్తి పరిచే చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. తాను దేశీయులందరికీ అధ్యక్షుడినన్నారు. అయితే స్వదేశం ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా విదేశీ వ్యవహారాల్లో పెద్దమనిషి పాత్ర పోషిస్తున్న మాక్రాన్‌పై స్వదేశంలో చాలామంది గుర్రుగా ఉన్నారు.

తొలి నుంచి మద్దతు
ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆరంభం కావడానికి ముందే యుద్ధ నివారణకు మాక్రాన్‌ చాలా యత్నాలు చేశారు. వ్యక్తిగతంగా పుతిన్‌తో చర్చలు జరిపారు. యుద్ధం ఆరంభమైన తర్వాత రష్యా చర్యను ఖండించడంలో ఉక్రెయిన్‌కు సాయం అందించడంలో ముందున్నారు. అందుకే మాక్రాన్‌ను నిజమైన స్నేహితుడు, నమ్మదగిన భాగస్వామిగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కొనియాడారు. పుతిన్‌ చర్యకు వ్యతిరేకంగా రష్యాపై మాక్రాన్‌ ఆంక్షలను కూడా విధించారు. అలాగే రష్యా సహజవాయువు అవసరం ఫ్రాన్స్‌కు లేదని, తాము గ్యాస్‌ కోసం ఇతర దేశాలపై ఆధారపడతామని మాక్రాన్‌ బహిరంగంగానే ప్రకటించారు.

దీంతో ఇకపై పుతిన్‌కు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌ మరింత చురుగ్గా వ్యవహరిస్తుందని భావిస్తున్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగిస్తామని మాక్రాన్‌ చెప్పారు. ఒకపక్క రష్యా చర్యను వ్యతిరేకిస్తూనే పుతిన్‌తో చర్చలకు తయారుగా ఉన్నానని ప్రకటించడం ద్వారా మాక్రాన్‌ హుందాగా వ్యవహరించారని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం ముదురుతున్న ఈ తరుణంలో ఫ్రాన్స్‌ ఈ సమతుల్యతను కొనసాగిస్తుందని భావిస్తున్నారు. అయితే అస్తవ్యస్తంగా మారిన ఫ్రాన్స్‌ ఆర్థికవ్యవస్థను గాడిన పెట్టడమనే పెద్ద సవాలు ప్రస్తుతం మాక్రాన్‌ ముందున్నదని నిపుణులు అంటున్నారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అదంత సులభం కాబోదంటున్నారు.

ఫ్రాన్స్‌ పీఠం మాక్రాన్‌దే
ఫ్రాన్స్‌ అధ్యక్షునిగా ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ (44) వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో ఈ ఫీట్‌ సాధించిన మూడో నాయకునిగా నిలిచారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో జాతీయవాదిగా పేరున్న ఫైర్‌ బ్రాండ్‌ నాయకురాలు మరీన్‌ లీ పెన్‌ (53)పై మాక్రాన్‌ విజయం సాధించారు. ఇప్పటిదాకా ఐదింట నాలుగొంతుల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మాక్రాన్‌కు 56 శాతానికి పైగా ఓట్లు రాగా పెన్‌ 44 శాతంతో సరిపెట్టుకున్నారు. 2017లో ఆయన 66 శాతం ఓట్లు సాధించారు.

గెలుపు అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘‘ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదితరాల నేపథ్యంలో మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నానా అనుమానాలతో, పలు రకాల విభజనలతో అతలాకుతలంగా ఉన్న దేశాన్ని మళ్లీ ఒక్కతాటిపైకి తెస్తా’’ అని ప్రకటించారు. యూరప్‌ దేశాధినేతలంతా ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాక్రాన్‌ను       అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. ఇండో–ఫ్రాన్స్‌ బంధాన్ని బలోపేతం చేసే దిశగా ఆయనతో మరింతగా కలిసి పని చేసేందుకు ఎదురు    చూస్తున్నట్టు చెప్పారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top