Russia Ukrain War: అణుయుద్ధంపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

అమెరికా ఆ పనిచేస్తే అణ్వాయుధాలు వాడతాం: పుతిన్‌

Published Wed, Mar 13 2024 1:46 PM

Putin Sensational Comments On Nuclear War - Sakshi

మాస్కో: దేశంలో సాధారణ ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజుల ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌కు అమెరికా గనుక తన సేనలను పంపితే తాము అణు యుద్ధానికి వెనకాడబోమని స్పష్టం చేశారు. మార్చ్‌ 15 నుంచి 17 వరకు దేశంలో ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో పుతిన్‌ మాట్లాడారు. ప్రస్తుతానికి అణుయుద్ధం చేయాల్సిన పరిస్థితులు లేవని, ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు వాడాల్సిన అవసరం తనకు కనిపించడం లేదన్నారు.

అయితే మిలిటరీ, సాంకేతిక కోణంలో తాము అణుయుద్ధం చేసేందుకు అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నామని పుతిన్‌ బాంబు పేల్చారు. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో చర్చలకు పుతిన్‌ సిద్ధంగా లేరని అమెరికా ప్రకటించిన తర్వాత అణుయుద్ధంపై రష్యా అధ్యక్షుడు స్పందించడం గమనార్హం. 1962 క్యూబన్‌ మిసైల్‌ సంక్షోభం తర్వాత మళ్లీ ప్రస్తుత ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాతే రష్యా, పశ్చిమ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

2022 ఫిబ్రవరిలో వేలాది మంది రష్యా సైనికులను ఉక్రెయిన్‌కు పంపి ఆ దేశంతో పూర్తిస్థాయి యుద్ధానికి పుతిన్‌​ తెరలేపారు. కాగా, అమెరికా సేనలు ఉక్రెయిన్‌లోకి  ప్రవేశిస్తే యుద్ధం తీవ్రస్థాయికి చేరుతుందని, తాము అణ్వాయుధాలు వాడాల్సి వస్తుందని పుతిన్‌ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు.   

ఇదీ చదవండి.. దాదాపు 70 ఏళ్ల తర్వాత రీ మ్యాచ్‌

Advertisement
Advertisement