
లండన్: బ్రిటన్‌లో పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అక్కడ బ్రిటన్ రాజు ఛార్లెస్‌ను కలిశారు. గురువారం రాజు అధికారిక నివాసాల్లో ఒకటైన నోర్ఫోక్ ప్రాంతంలోని సాండ్రింగ్‌హామ్ హౌస్‌కు విచ్చేసిన మోదీని ఛార్లెస్ సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరూ కొద్దిసేపు పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఛార్లెస్‌కు మోదీ తెల్లని పూరెమ్మలు ఉండే సోనోమా డేవిడియా ఇన్వాలుక్రాటా అనే వింతైన మొక్కను బహూకరించారు.
ఈ చెట్టుకు పూసే పూలను దూరం నుంచి చూస్తే గాల్లో ఎగిరే తెల్లపావురాల్లా కనిపిస్తాయి. శ్వేతవర్ణ పూరెమ్మలు ఉండటంతో దీనిని హ్యాండ్‌కర్చీఫ్ చెట్టు అని కూడా అంటారు. అమ్మ పేరిట ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా ఛార్లెస్‌కు మోదీ ఈ మొక్కను బహుమతిగా అందించారు. తల్లిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం తెల్సిందే. సాధారణంగా డేవిడియా మొక్క నాటిన 20 ఏళ్ల తర్వాతే పూలు పూస్తుంది. కానీ సోనోమా రకం సంకరజాతి మొక్క కేవలం రెండు, మూడేళ్లలోనే విరగబూస్తుంది.