చెట్లకు సెలైన్‌లో విషం పెట్టి.. లక్షకు కిలో లెక్కన అమ్మి..  

Poisoning To Trees For Create Most Expensive Wood In Asia - Sakshi

సాధారణంగా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నవారికో, సర్జరీలు జరిగిన వారికో సెలైన్‌ పెట్టడం చూస్తూనే ఉంటాం. కానీ చెట్లకు పెద్ద పెద్ద సెలైన్లు పెడితే..!? ఇదేం పిచ్చి ఆలోచన, చెట్లకు సెలైన్‌ ఎందుకు? దానితో లాభమేంటి? అనిపిస్తోంది కదా.. ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఫొటోలు ఇలాంటి ఎన్నో సందేహాలు, అభిప్రాయాలను మోసుకొచ్చాయి..

నిరసనో.. చికిత్సనో అనుకుని.. 
చెట్లకు సెలైన్‌ పెట్టిన ఫొటోలను చూసి చాలా మంది.. అడవుల నరికివేతకు నిరసనగా చేపట్టిన కార్యక్రమమేమో అనుకున్నారు. కొందరైతే ఫంగస్‌ సోకిన చెట్లకు చికిత్సగా మందు పెట్టారని అన్నారు. కానీ అసలు విషయం తెలిసి చాలా మంది అవాక్కయ్యారు. ఎందుకంటే.. ఈ చెట్లకు సెలైన్‌ పెట్టింది ప్రపంచంలోనే అత్యంత విలువైన, ప్రత్యేకమైన సుగంధ కలపను తయారు చేయడానికి మరి. 

రక్షణ కోసం సుగంధం.. 
ఆసియా దేశాల్లో పెరిగే అక్విలేరియా చెట్లు ఇవి. పలుచోట్ల కైనం, క్యారా అనే పేర్లతోనూ పిలుస్తారు. నిజానికి వీటి కలప మామూలుగానే, ఎటువంటి వాసన లేకుండా ఉంటుంది. కానీ ఈ చెట్లకు ‘ఫియలోఫోరా పారాసైటికా’ అనే ఫంగస్‌ సోకినప్పుడు.. దాని నుంచి రక్షణ కోసం ప్రత్యేకమైన నల్లటి రెసిన్‌ను విడుదల చేస్తాయి. ఈ రెసిన్‌ కలిసిన కలప అత్యంత ఘాటైన సుగంధాన్ని వెదజల్లుతుంది. పూర్వకాలం నుంచీ రాజులు, రాణులు, ఉన్నత వర్గాల వారు ఈ కలపను వినియోగించేవారు. 

ఆ విషాన్నే ఎక్కిస్తూ.. 
నిజానికి ఈ ఫంగస్‌ చెట్లకు విషం వంటిది. దాన్ని నిరీ్వర్యం చేసేందుకే రెసిన్‌ను విడుదల చేసుకుంటాయి. దీనిని గుర్తించిన పెంపకందారులు.. సదరు ఫంగస్‌ కలిపిన ద్రావణాన్ని సెలైన్‌ బ్యాగుల్లో నింపి, ఈ చెట్ల కాండాల లోపలికి సూదులు గుచ్చి పంపించడం మొదలుపెట్టారు. దీనితో చెట్లు రెసిన్‌ విడుదల చేస్తాయి. కాండం సుగంధ కలపగా మారుతుంది. నిజానికి ఈ ప్రక్రియకు పెద్దగా ఖర్చేమీకాదు. కానీ ఈ చెట్లను పెంచి, సుగంధ కలపగా మార్చేవారు తక్కువగా ఉండటంతో డిమాండ్, ధర చాలా ఎక్కువ. ఇండోనే షియా, మయన్మార్, వియత్నాంతోపాటు పలు ఇతర ఆసియా దేశాల్లోనూ వీటిని పెంచుతుంటారు.  

సెలైన్‌లో ఫంగస్‌తో..
ఈ చెట్లలో మొత్తం కలప సుగంధభరితంగా మారదు. ఫంగస్‌ సోకిన భాగం, దాని చుట్టూ కొంతమేర మాత్రమే రెసిన్‌ నిండుతుంది. అందువల్ల రోజూ ఓ భాగంలో సూది గుచ్చి ఫంగస్‌ ద్రావణాన్ని సెలైన్‌లా ఎక్కిస్తుంటారు. ఇలా చాలాకాలం చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ చెట్టును కొట్టి.. కాండాన్ని చాలా జాగ్రత్తగా ముక్కలు చేస్తారు. సుగంధ భరితంగా మారిన భాగాలను వేరు చేసి విక్రయిస్తారు. ఇలా సేకరించిన ముక్కల విలువ కిలోకు రూ.లక్షపైనే ఉంటుంది. ఇక ఈ కలప నుంచి తీసిన సుగంధ నూనె అయితే లీటరుకు సుమారు రూ.60 లక్షల వరకు పలుకుతుందట.
- సాక్షి, సెంట్రల్‌డెస్క్‌     

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top