న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సంచలంగా మారింది. 2001, సెప్టెంబర్ 11 ఉగ్ర దాడులతో అమెరికాకు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా మారిన అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్.. మహిళ వేషంలో టోరా బోరా కొండల నుండి తప్పించుకున్నాడని కేంద్ర నిఘా సంస్థ(సీఐఏ) మాజీ అధికారి జాన్ కిరియాకౌ తాజాగా వెల్లడించారు. 2001లో టోరా బోరా కొండలలో అమెరికా దళాలు ఒసామా బిన్ లాడెన్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించినప్పుడు, అతడు మహిళా వేషం ధరించి అక్కడి నుంచి తప్పించుకున్నాడని తెలిపారు.
జాన్ కిరియాకౌ ఏఎన్‌ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికా సైన్యంలో రహస్యంగా చొరబడిన అల్ ఖైదా కార్యకర్త సహాయంతో ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్.. మహిళ వేషం వేసుకుని, టోరా బోరా నుంచి తప్పించుకున్నాడని తెలిపారు. సీఐఏలో 15 ఏళ్లు పనిచేసి, పాకిస్తాన్‌లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు నాయకత్వం వహించిన కిరియాకౌ, అమెరికాలో సైనిక శ్రేణుల్లో అల్ ఖైదా కార్యకర్తల చొరబాట్లను తెలియజేశారు. 9/11 దాడుల అనంతరం అమెరికా సంయమనంగా వ్యవహరించింది, ఆఫ్ఘనిస్తాన్‌లో బాంబు దాడులను చేపట్టేందుకు నెల్లాళ్లు వేచివుందన్నారు. ఈ తరుణంలోనే అల్ ఖైదా చొరబాటుదారునిగా తేలిన అనువాదకుడు ఉగ్రవాది బిన్ లాడెన్ తప్పించుకునేందుకు అవకాశం కల్పించాడని తెలిపారు.
EP-10 with Former CIA Agent & Whistleblower John Kiriakou premieres today at 6 PM IST
“Osama bin Laden escaped disguised as a woman...” John Kiriakou
“The U.S. essentially purchased Musharraf. We paid tens of millions in cash to Pakistan’s ISI...” John Kiriakou
“At the White… pic.twitter.com/pM9uUC3NIC— ANI (@ANI) October 24, 2025
లాడెన్ తప్పించుకున్న ఘటన దరిమిలా యూఎస్ ఉగ్రవాద నిరోధక దృష్టి పాకిస్తాన్ వైపు మళ్లిందని జాన్ కిరియాకౌ తెలిపారు. ఈ నేపధ్యంలో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌తో చర్చలు జరిగాయని, అతను అమెరికా నుంచి ఆర్థిక, సైనిక సహాయానికి బదులుగా దేశంలోకి యూఎస్ కార్యకలాపాలను అనుమతించాడని పేర్కొన్నారు. అదే సమయంలో సీఐఏ పాకిస్తాన్ గ్రూప్ లష్కరే తోయిబా, అల్-ఖైదా మధ్య గల సంబంధాలను గుర్తించిందన్నాను. ఇది అమెరికా నిఘా వ్యవహారాల్లో మైలురాయిగా నిలిచిందన్నారు.
భారత్-పాక్‌ల గురించి మాట్లాడిన జాన్ కిరియాకౌ 2002లో భారతదేశం- పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తుందని అమెరికా నిఘా సంస్థలు భయపడ్డాయని, పార్లమెంట్ దాడి, ఆపరేషన్ పరాక్రమ్ సమయంలో పెరిగిన ఉద్రిక్తతలే దీనికి కారణమన్నారు. నాడు అమెరికా ఈ ముప్పును తీవ్రంగా పరిగణించిందని, అందుకే ఇస్లామాబాద్ నుండి అమెరికన్ కుటుంబాలను ఖాళీ చేయించామని అన్నారు. ఆ సమయంలో వాషింగ్టన్ దృష్టి అల్ ఖైదా, ఆఫ్ఘనిస్తాన్‌పైననే ఉందని, అందుకే భారతదేశ ఆందోళనలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన వివరించారు.
2008 ముంబై దాడుల గురించి కిరియాకౌ మాట్లాడుతూ ఈ దాడుల వెనుక పాకిస్తాన్ మద్దతు కలిగిన కశ్మీరీ ఉగ్రవాద గ్రూపుల హస్తం ఉందని అమెరికా నిఘా సంస్థలు భావించాయన్నారు. పాకిస్తాన్.. భారతదేశంలో ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తోందని ఆయన అన్నారు. పార్లమెంట్, ముంబై దాడుల తర్వాత భారత్ సంయమనం పాటించిందని, అయితే ఇప్పుడు భారత్ వ్యూహాత్మక సహనాన్ని కలిగి ఉండలేని స్థితిలో ఉందని ఆయన అన్నారు. ఎప్పుడు యుద్ధం వచ్చినా, భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోతుందని ఆయన కిరియాకౌ హెచ్చరించారు. నిరంతరం భారతీయులను రెచ్చగొట్టడంలో అర్థం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, 2011 మే 2న అమెరికా నేవీ సీల్ టీమ్ 6 పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో బిన్ లాడెన్‌ను హతమార్చినట్లు అధికారికంగా ప్రకటించబడింది. కేవలం 2001లో అమెరికా పట్టుకునేందుకు యత్నించిన సమయంలో లాడెన్ తప్పించుకున్నాడనేది మాజీ సీఐఏ అధికారి వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.


