PM Imran Khan: లాస్ట్ ఓవర్‌.. ఐదు బంతులు.. 36 పరుగులు.. ఇమ్రాన్‌ ఖాన్‌ ఏం చేస్తాడో?

No Confidence Motion Tabled What Pak PM Imran Khan Do Now - Sakshi

నయా పాకిస్థాన్‌ నినాదంతో 2018లో అధికార పీఠం ఎక్కిన ఇమ్రాన్‌ ఖాన్‌ పీటీఐ సర్కార్‌.. ఈ నాలుగేళ్లలో సాధించింది ఏం లేదన్నది అక్కడ ప్రజల మెదళ్లలో బలంగా పాతుకుపోయింది. అందుకే రాజకీయ సంక్షోభాన్ని పట్టించుకోకుండా తమ పనుల్లో మునిగిపోతున్నారు. పార్లమెంట్‌లో ఇప్పటికే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. మార్చి 31వ తేదీన దీనిపై చర్చ జరగనుంది. 

బంధు ప్రీతి, దేశ ద్రవ్యోల్బణం.. అధిక ధరలు, కరోనా కట్టడిలో ఘోరంగా విఫలం, అప్పులు, నిరుద్యోగుల నిరసనలతో పీటీఐ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్‌లో నిరసనలు పెలుబిక్కాయి. ఈ నిరసనలనే ఆయుధంగా చేసుకుని ఖాన్‌ సాబ్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది ప్రతిపక్ష పీఎంఎల్‌–ఎన్‌. పాక్‌ నేషనల్‌ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులు ఉన్నారు. అవిశ్వాసం నుంచి ప్రభుత్వం గట్టెక్కాలంటే.. 172 మంది మద్ధతు అవసరం. అధికార పీటీఐకి 155 మంది సభ్యులుండగా, నాలుగు మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వానికి మొత్తం 179 మంది సభ్యుల బలముంది. కానీ, ఇమ్రాన్‌ సొంత పీటీఐ పార్టీకి చెందిన సుమారు 25 మంది, అధికార సంకీర్ణ కూటమిలోని 23 మంది..  ధిక్కార స్వరం వినిపించడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.  

ఇమ్రాన్‌ ఖాన్‌ ముందు ఇప్పుడు కొన్ని ఆప్షన్స్‌ ఉన్నాయి. వాటిలో చాలావరకు అతనికి అనుకూలంగా లేవు. మొదటి నుంచి పొసగకపోవడం, పైగా తాము చెప్పినట్లు నడవడం లేదన్న కోపంతో పాక్‌ ఆర్మీ ఉంది. అందుకే ప్రభుత్వం పడిపోయే తరుణంలోనూ సాయం చేయలేమని తెగేసి చెప్పింది. పైగా రాజీనామా చేయాలంటూ ఇమ్రాన్‌ ఖాన్‌కు సూచించింది. ఇంకోవైపు వలసలు సైతం ఇమ్రాన్‌ ఖాన్‌కు తలనొప్పిగా మారాయి. ఈ తరుణంలో.. 

కేవలం రాజకీయాల ద్వారానే ఇప్పుడు పరిస్థితిని కొలిక్కి తెచ్చుకోవాలి. అందుకోసం ముందస్తు ఎన్నికలకు వెళ్తాననే హామీ సైతం ఇచ్చారాయన. కానీ, ప్రతిపక్షాలు ఆ హామీకి ఒప్పుకోకపోవచ్చు. అందుకే.. ఇమ్రాన్‌ ఖాన్‌ ముందున్న మరొకొన్ని ఆఫ్షన్స్‌పై మీద పీటీఐలో చర్చ నడుస్తోంది.  ఎంక్యూఎం-పీ కోసం మంతత్రిత్వ శాఖ, గవర్నర్‌ పోస్ట్‌ ఎర వేస్తోంది. అదే సమయంలో తన ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు ఇమ్రాన్‌ ఖాన్‌. ఈ క్రమంలో ప్రతిపక్షాలతో పాటు సొంత పక్షం వాళ్లతోనూ ఇమ్రాన్‌ ఖాన్‌ మైండ్‌ గేమ్‌ ఆడుతుండడం స్పష్టంగా కనిపిస్తోంది.

ఏం చేస్తాడో..
క్రికెట్‌.. రాజకీయం రెండూ ఇమ్రాన్‌ ఖాన్‌కు ఒక్కటే. ఈ రెండింటిలోనూ.. తెలివిగా, లోతుగా, అభిమానుల నినాదాలు.. ఆశీర్వాదంతో చెలరేగడానికి ప్రయత్నించాడు. బహుశా ఇప్పుడున్న కష్టకాలంలోనూ.. ఈ పోలిక సరిపోయేదే!.  ప్రభుత్వం ఎదుర్కొంటున్న కష్టమైన, అసాధ్యమైన పరిస్థితిని వివరించడానికి సరిపోతుంది.  

చివరి ఓవర్‌లో ఐదు బంతులు మిగిలి ఉన్నాయి. 36 పరుగులు అవసరం.  ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప ఇమ్రాన్‌ ఖాన్‌ పొలిటికల్‌ మ్యాచ్‌ నెగ్గలేడు. ప్రత్యర్థి బౌలర్ల(ప్రతిపక్షాల) నుంచి నో బాల్స్‌(మద్ధతు) ఏదైనా పడాల్సిందే. లేదంటే అంపైర్లు(కోర్టు.. న్యాయమూర్తులు) ఏదైనా వివాదాస్పద నిర్ణయం తీసుకోవాలి. అదీ కాకుంటే మైదానంలో రచ్చ జరిగితే.. ఏకంగా మ్యాచ్‌ రద్దు అయ్యి పోవాలి(పార్లమెంట్‌లో గందరగోళం.. అరెస్టుల పర్వం). అప్పుడు కచ్చితంగా థర్డ్‌ అంపైర్‌(పాక్‌ ఆర్మీ) జోక్యం చేసుకుంటుంది. లేకుంటే చిన్నపిల్లలాగా మ్యాచ్‌ ఓడిపోయే తరుణంలో.. వికెట్లు గుంజుకుని, బాల్‌-బ్యాట్‌ ఎత్తుకుని మైదానం నుంచి పారిపోవచ్చు(చర్చకు సిద్ధపడకుండా బయటకు వెళ్లిపోవడం). ఇవేవీ కాకుంటే.. 1992 ప్రపంచకప్‌ సెమీస్‌లో మాదిరి డక్‌వర్త్‌ లూయిస్‌ లాంటి నిబంధన ఏదైనా కలిసొస్తే.. అది ఖాన్‌ సాబ్‌ అదృష్టమే! ఏది ఏమైనా.. పాక్‌ నేషనల్‌ అసెంబ్లీ అనే గ్రౌండ్‌లో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో చివరి నిమిషం వరకు నరాలు తెగే  ఉత్కంఠ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top