నైజీరియాలో వైమానిక దాడి: 100 మంది పౌరుల మృతి? | Nigerian military airstrike kills 100 civilians rights group claims army denies | Sakshi
Sakshi News home page

నైజీరియాలో వైమానిక దాడి: 100 మంది పౌరుల మృతి?

May 13 2026 1:26 AM | Updated on May 13 2026 1:29 AM

Nigerian military airstrike kills 100 civilians rights group claims army denies

అబూజా: నైజీరియాలోని ఉత్తర ప్రాంతంలో ఉగ్రవాదులే లక్ష్యంగా సైన్యం జరిపిన వైమానిక దాడి పెను విషాదాన్ని మిగిల్చింది. జాంఫారా రాష్ట్రంలోని తుమ్ఫా గ్రామంలో ఆదివారం ఒక మార్కెట్‌పై జరిగిన ఈ దాడిలో సుమారు 100 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ 'అమ్నెస్టీ ఇంటర్నేషనల్' వెల్లడించింది. మృతుల్లో అత్యధికులు కౌమార బాలికలు, చిన్న పిల్లలే ఉన్నట్లు పేర్కొంది.

సైన్యం ఖండన

ఈ ఆరోపణలను నైజీరియా సైన్యం తీవ్రంగా ఖండించింది. తాము కేవలం సాయుధ ముఠాలనే లక్ష్యంగా చేసుకున్నామని, పౌరులను పొరపాటున కూడా లక్ష్యంగా చేసుకోలేదని ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ మైఖేల్ ఒనోడా స్పష్టం చేశారు. అయితే, ఒక్క గ్రామంలోనే 80 మందికి పైగా సామాన్య పౌరుల అంత్యక్రియలు జరిగాయని, అక్కడ తిరుగుబాటుదారులు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అమ్నెస్టీ నైజీరియా డైరెక్టర్ ఇసా సనుసి ధ్వజమెత్తారు.

పునరావృతమవుతున్న పొరపాట్లు

బోకో హరామ్ వంటి ఉగ్రవాద సంస్థలతో పోరాడుతున్న నైజీరియాలో.. క్షేత్రస్థాయి సిబ్బంది, వాయుసేన మధ్య సమన్వయ లోపం కారణంగా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. గత నెలలోనూ జరిగిన ఒక పొరపాటు దాడిలో 100 మంది మరణించారు. సాయుధ ముఠాలు స్థానిక ప్రజల్లో కలిసిపోయి ఉండటం వల్ల లక్ష్యాలను గుర్తించడం కష్టమవుతోందని సైనిక వర్గాలు వాదిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement